వారం రోజుల్లో రైతుబంధు: సీఎం కేసీఆర్

నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని, ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 

ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని నియంత్రిత పద్థతిలో పంటల సాగుకు సిద్థపడిన రైతులను సీఎం కేసీఆర్ అభినందించారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని, దీనికి రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని సీఎం తెలిపారు. పెట్టుబడి డబ్బుల కోసం రైతులు ఇబ్బంది పడొద్దని, ఒక్క ఎకరం కూడా మిగలకుండా, ఒక్క రైతునూ వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం ఏడు వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో రూ. 1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం. తక్షణం రైతులకు రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే పని ప్రారంభమవుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.