పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ... 22న జనసేన తీర్థం!

వైసీపీ కబంద హస్తాల నుంచి బుధవారం నాడు విముక్తి పొందిన ప్రకాశం జిల్లా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని గురువారం నాడు కలిశారు. ఈ భేటీ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా, పవన్ కళ్యాణ్ ఆయనని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 

లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులు కావచ్చేమోగానీ, వైసీపీలో వున్నవాళ్ళందరూ దుర్మార్గులు కాకపోవచ్చు. ఎందుకంటే, విలువలకు కట్టుబడి వున్న బాలినేని లాంటివాళ్ళు ఆ పార్టీలో చాలామంది వున్నారు. పొయ్యి సెగ పొంతకి తగిలినట్టు జగన్  మీద వున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రభావం వాళ్ళమీద పడి వైసీపీలో వున్న ఉత్తములు కూడా ఓడిపోయారు. అలాంటి వారిలో బాలినేని కూడా ఒకరు. జగన్‌తో బంధుత్వం వున్నా బాలినేని జగన్ ఆడమన్నట్టుగా ఆడేవారు కాదు. వాగమన్నట్టుగా వాగేవారు కాదు. మాటలో హుందాతనం, పద్ధతి వుండాలని అనేవారు. ఇంతకాలంపాటు వైసీపీలో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇప్పటికి ఆయన బయటపడ్డారు. గురువారం నాడు బాలినేని పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీలో చేరే ముహూర్తం మాత్రం ఈనెల 22 ఫిక్స్ చేవారు. ఆరోజున బాలినేనితోపాటు  
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్,  పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.