సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారా? అయితే వెంటనే మీరు ఇలా చేయండి.. 

దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. కొవిడ్ లాక్ డౌన్ లో ఈ కేసులు మరింత పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయలకులకు వల వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. దేశంలో పెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్ పై కేంద్ర హోంశాఖ ఫోకస్ చేసింది. ఫిర్యాదు కోసం దేశ వ్యాప్తంగా ఒక నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ నేరగాళ్ల  చేతిలో మోసపోయిన వారు.. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. డబ్బు బదిలీని అడ్డుకోవచ్చు. 

 సైబర్‌ నేరగాళ్లు వివిధ పద్దత్తుల్లో తమ పని కానిచ్చేస్తున్నారు.  మాయమాటలతో జనాలను బుట్టలో వేసుకుంటున్నారు. వాళ్లను  నమ్మి సొమ్ము బదిలీ చేస్తున్నారు. ఓటీపీలు,క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేస్తున్నారు. సామాన్య జనాలే కాదు ఉన్నత విద్యావంతులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తులు కూడా సైబర్ వలలో చిక్కుకుంటున్నారంటే కేటుగాళ్లు ఎంతలా స్కెచ్ వేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్‌ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసు కుంటారు.   ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది.

మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155260 అమల్లోకి తెచ్చింది.ఏప్రిల్‌లో ఈ నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో కొచ్చింది.  ఆర్‌బీఐ సహా అన్ని ప్రధాన బ్యాంకులు,పేమెంట్‌ బ్యాంకులు,వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్,మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.       ఏడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్,ఢిల్లీ, మధ్యప్రదేశ్,రాజస్తాన్, తెలంగాణ,ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌) హెల్ప్‌లైన్‌ అమల్లో ఉంది.

డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలా వరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్‌ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు..ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్,మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అధికారులు వెనక్కి రప్పించ గలిగారు.సో. అందరూ కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన ఈ నెంబర్ ను ఫోన్ లో సేవ్ చేసి పెట్టుకోండి...