జయలలిత కాన్సెప్ట్ కు చంద్రబాబు కనెక్ట్ అవుతాడా..?

 

టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని మనందరికి తెలిసిన విషయమే. అలాంటి చంద్రబాబుకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఐడియా ఇచ్చారంట. అయితే డైరెక్ట్ కాదులెండి... ఇన్ డైరెక్ట్ గా. ఇంతకీ  ఆ ఐడియా ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల‌న్నింటినీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి జయలలిత శ్రీకారం చుట్టారు.  ఈనేపథ్యంలో దీనిపై ఆమె అసంబ్లీలో ఓ ప్రకటన కూడా చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేస్తామన్నారు. ఇందుకు రూ.160 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా అత్యున్నత విద్యా ప్రమాణాలను అన్ని విశ్వవిద్యాలయాలు పంచుకుని అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని జ‌య చెప్పారు. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధన విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కలుగుతాయని, ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు, ఉన్నతవిద్యకు అందిస్తున్న పథకాలు, ఫలాల గురించి కూడా ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా తెలియజేస్తామన్నారు.

 

అయితే ఇప్పుడు ఈ ఐడియా చంద్రబాబుకి ఉపయోగపడుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే నధుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ కు కూడా కనెక్ట్ అవుతారేమో.. ఈ కాన్సెప్ట్ ద్వారా క్యాంప‌స్‌ల‌ను క‌నెక్ట్ చేస్తారేమో అని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..