బీజేపీని ఏమన్నా అంటే ఊరుకోను....
posted on Dec 19, 2017 10:54AM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కొన్నిఆదేశాలు జారీ చేశారు. పార్టీ అనుమతి లేకుండా మిత్రపక్షం భాజపాపై ఎవరూ నోరు జారొద్దని.. భాజపా నేతలు తెలుగుదేశంపై విమర్శలు చేసినా వారి విజ్ఞతకే వదిలేయాలని హితవు పలికారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో దీనిపై మాట్లాడిన ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.. టీడీపీ గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసందే. 2019లో జరిగే ఎన్నికల్లో ఏపీలో బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల సంద్భంగా సీట్లను యాచించే స్థితిలో బీజేపీ ఉండదని.. అధికారపక్షాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందని తెలిపారు. దీనిపై టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పందించి.. బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 2019లో ఏపీలో అధికారాన్ని శాసించేది బీజేపీనే అంటూ.. టీడీపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటి కలలు కనడం మానుకోవాలని అన్నారు.
దీనికి గాను చంద్రబాబు రాజేంద్రప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజులాంటివారి వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని... పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై టీడీపీ నేతలెవరూ కామెంట్లు చేయవద్దని ఆయన ఆదేశించారు. పార్టీ అనుమతి లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే వూరుకునేది లేదని హెచ్చరించారు.