వేసవి ప్రణాళిక.. చంద్రబాబు సమీక్ష
posted on Mar 25, 2025 10:40AM

రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌ తున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం (మార్చి 24) నాడు సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
వేసవి ప్రణాళిక విషయంలో చాలా పకడ్డందీగా వ్యవహరించాలన్నారు. అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ అలర్ట్ ల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే అవసరమైన అన్ని ప్రాంతాలలోనూ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలన్నారు.
ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో తాగునీటి, పశుగ్రాసం కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలన్నారు. మునిసిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద నీటి కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు.