రాష్ట్ర పాలనపై కేంద్రం నిఘా?
posted on Sep 9, 2011 11:40AM
హైద
రాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై కాంగ్రెసు అధిష్టానం నిఘా పెట్టిందా అంటే గవర్నర్ నరసింహన్ తీరును గమనిస్తోన్న వారు అవుననే సమాధానం చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం రాష్ట్రంలో పలు సంక్షోభాలు ఎదురు కావడంతో అధిష్టానం గవర్నర్ నరసింహన్‌ను నిఘా పెట్టినట్లుగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాం నుండే నరసింహన్ ఎప్పటికప్పుడు అధిష్టానానికి రాష్ట్ర పాలన, రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై నివేదిక ఇస్తూ వచ్చినట్లుగా సమాచారం. అధిష్టానం ఎప్పటికప్పుడు పాలనా తీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ తన వైఖరితో రాజకీయ నాయకుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాజకీయ నాయకుల నుండి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ నరసింహన్ మాత్రం తన పంథాలోనే వెళుతున్నారు. శాంతి భద్రతలు, సంక్షేమం, ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై నరసింహన్ దృష్టి సారిస్తున్నారు. నెలవారీ ప్రభుత్వ నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారట. ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులను పిలిపించుకొని నివృత్తి చేసుకుంటున్నారని సమాచారం. ఉద్యమం ప్రభావం ఎలా ఉంది, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎలా ఉంది తదితర అంశాలపై గుట్టుగా కేంద్రానికి గవర్నర్ చేరవేస్తున్నారట. రోశయ్య పాలనలో ప్రారంభమైన నిఘా కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ కొనసాగుతోంది. మొత్తానికి అందరి గవర్నర్‌లలా రాష్ట్రంలో తాను రబ్బరు స్టాంప్ కాదని నరసింహన్ నిరూపించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.