ఇక డ్రామా ఆపేయ్.. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశం?

పరువు నిలువునా గంగలో కలిసిపోయింది. వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు పార్టీ పరువునే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ పరువును కూడా మంటగలుపుతోందన్న భావన తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు.. తిన్నగా సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన సందేశం అవినాష్ కు చేరిందని అంటున్నారు.

ఆ సందేశాన్ని కూడా వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ద్వారా పంపారని అంటున్నారు. సోమవారం (మే22) కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విజయమ్మ అవినాష్ తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అవినాష్ తో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే అవినాష్ ను  ఇక ఈ హై డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టి సీబీఐ విచారణకు హాజరవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. సూచన కాదు దాదాపుగా ఆదేశించారనే అంటుంటున్నారు. ఒక వేళ సీబీఐ అరెస్టు చేసినా కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అక్రమాస్తుల కేసులో తన బిడ్డ జగన్ 16 నెలలు జైలులో ఉండి రాలేదా అని కూడా విజయమ్మ అవినాష్ కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ అవినాష్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారిందనీ, అలాగే  జగన్ కూ చెడ్డపేరు వచ్చిందనీ, ఇక ఫుల్ స్టాప్ పెట్టకుంటే నివారించలేనంత నష్టం జరుగుతుందని విజయమ్మ అవినాష్ కు నచ్చ చెప్పిట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. అయితే చివరి ఆశగా సుప్రీంలో అవినాష్ దాఖలు చేసిన నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అవినాష్ విజయమ్మతో అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. ఇక అవినాష్ ఏం నిర్ణయం తీసుకుంటారని అంతటా ఉత్కంఠ నెలకొంది. 

కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలు, ‘హైడ్రామా’తో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్‌ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘రచ్చ’కు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది’’ అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.