బందరెళితే.. బందరే!
posted on May 23, 2023 2:29PM
బందరు పోర్టు శంకుస్థాపన చివరికి ఒక ప్రహసనంగా తయారైంది. ఇప్పటికే రెండు సార్లు పునాదిరాయి పడిన బందరు పోర్టుకు మళ్లీ పునాదిరాయి పడింది. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణానికి నోచుకోకపోవడం బందరు పోర్టు ప్రత్యేకత. బందరు పోర్టు శంకుస్థాపన కథ కొంత విచిత్రంగానే ఉంటుంది. బందరులో పోర్టు నిర్మాణానికి తీర ప్రాంతం అనువైనదని వందల సంవత్సాల ముందే నిర్ణయించారు.
అయితే తూర్పు తీర ప్రాంతంలో అనేక మేజర్ పోర్టులు ఉండటంతో బందరు పోర్టు ఆలస్యమవుతూ వచ్చింది. 2009 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2008 ఏప్రియల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. 2009 ఎన్నికలలో గెలిచిన వైఎస్ఆర్ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన హడావుడి పోర్టు నిర్మాణం వైపు సాగలేదు. పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు చర్యలు తీసుకోలేదు.
ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు, అక్కడ నుంచి ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు భారీగా జరుగుతూ ఉండడంతో మిగిలిన పోర్టుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లలేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం హయాంలో తిరిగి పోర్టుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమం్రతి చంద్రబాబునాయుడు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాటు పోర్టు పనులను అటకెక్కించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే పాలన అంటూ ఖజానా ఖాళీ చేసిన జగన్ ప్రభుత్వం బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి భారీ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించలేకపోయింది. వేల కోట్ల ఖర్చు అయ్యే ఇలాంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించడం జగన్ సర్కార్ కు అసాధ్యమే అయింది.
అయితే మే 22వ తేదీన బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా పోర్టు పేరెత్తని జగన్ ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. గతంలో జరిగిన శంకుస్థాపనలకు ప్రత్యక్ష సాక్షి అయిన పేర్ని నాని ఈ సారి కూడా జగన్ త బందర్ పోర్టు పనులను మరోసారి ప్రారంభించారు.
అయితే 2008లో ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించగా, 2014లో పనులు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి పదవికి దూరమయ్యారు. 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతర ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. తాజాగా అదే పోర్టును శంకుస్థాపన చేసిన జగన్ కు రానున్న ఎన్నికలలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా బందరు సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు.