ఇక అరెస్టే.. సుప్రీంలో అవినాష్ కు చుక్కెదురు
posted on May 23, 2023 12:59PM
సుప్రీం కోర్టులో అవినాష్ కు చుక్కెదురైంది. చివరి ఆశ కూడా ఆవిరైపోయింది. సీబీఐ అరెస్టును నుంచి అవినాష్ కు సుప్రీంలో కూడా రక్షణ లభించలేదు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.
ఇక అవినాష్ కు సీబీఐతో దాగుడుమూతలు అడే అన్ని దారులూ మూసుకుపోయాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రెగ్యులర్ బెంచ్.. వేసవి సెలవుల దృష్ట్యా దీనిపై నిర్ణయం ప్రకటించకుండా జూన్ 5కు విచారణ వాయిదా వేసింది.
దీంతో ఆ వెకేషన్ బెంచ్ లో తన ముందస్తు బెయిలుపై విచారణ పూర్తయ్యే వరకూ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని సుప్రీంను ఆశ్రయించారు. అవినాష్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం అవినాష్ విజ్ణప్తిని తోసి పుచ్చింది.
అవినాష్ ముందస్తు బెయిలుపై ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు మాత్రం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా సీబీఐ అవినాష్ ను అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయి.