‘మేము సైతం’లో చిరంజీవి, చంద్రబాబు కబుర్లు

 

తెలుగు చిత్ర పరిశ్రమ నిన్న నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం ముగింపు సమయంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు, ఆయన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పక్క పక్కనే కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకోవడం ఆ తరువాత స్టేజి మీద కూడా పక్క పక్కనే నిలబడి ఏదో మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం చేస్తునప్పుడు కూడా చిరంజీవి మిగిలిన వారితో బాటు ఆయన పక్కనే నిలబడి శ్రద్ధగా వినడం అందరినీ ఆకర్షించింది. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో ఎటువంటి రాజకీయ విమర్శలకు తావీయకుండా, విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించాలని కోరారు. నిత్యం తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, శంషాబాద్ దేశీయ విమానాశ్రయ టెర్మినల్ కి యన్టీఆర్ పేరు పెట్టడాన్ని రాజ్యసభలో వ్యతిరేకించిన చిరంజీవికి ఆయన ఈ సందర్భంగా చురకలు వేస్తారనుకొన్నప్పటికీ ఆయన ఆ ప్రసక్తి తేకుండా స్వర్గీయ యన్టీఆర్ బాటలోనే తమ పార్టీ నడుస్తుందని అన్నారు.

 

తరువాత మాట్లాడిన చిరంజీవి కూడా తన ప్రసంగంలో ఎటువంటి రాజకీయాలు ప్రసక్తి తేకుండా “తమను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ఎటువంటి కష్టమొచ్చినా చిత్ర పరిశ్రమ కూడా వారికి ఎప్పుడూ అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి మేటి హీరోయిన్లు జయసుధ, జయప్రద, మిగిలిన అందరితో కలిసి ‘మేము సైతం’ గానం ఆలపించడం అందరినీ ఆకట్టుకొంది.