కోర్టు మెట్లు ఎక్కుతానంటున్న చెన్నై డాక్టర్ భార్య 

ఇటీవల చెన్నైలో సైమన్ హెర్క్యులస్ అనే డాక్టర్ కరోనాతో మృతి చెందడం తెలిసిందే. అతడి మృతదేహాన్ని అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య మరో డాక్టర్ ఖననం చేయాల్సి వచ్చింది. దీనిపై సైమన్ హెర్క్యులస్ అర్ధాంగి ఆనంది హెర్క్యులస్ తీవ్రస్థాయిలో స్పందించారు. అత్యుత్తమ సేవలు అందించిన తన భర్తకు ఆ స్థాయిలోనే అంతిమ సంస్కారాలు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ఎడప్పాడి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు.

దీనిపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. కరోనాతో మృతి చెందిన డాక్టర్ అవశేషాలను ఇప్పుడు మళ్లీ వెలికితీయడం ఏమంత సురక్షితం కాదని స్పష్టం చేశారు. అయితే తాను ఈ విషయాన్ని వదిలిపెట్టనని, కోర్టుకైనా వెళతానని ఆనంది తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం మృతశరీరంలో వైరస్ జీవించేది మూడు గంటలేనని, దీని ప్రకారం  వేలంగాడు శ్మశానవాటికలో ఖననం చేసిన తన భర్త మృతదేహాన్ని వెలికి తీసి కీల్పాక్ శ్మశానవాటికలో గౌరవప్రదంగా ఖననం చేయాలని ఆనంది కోరారు.