చెన్నైకి శాపంగా మారిన వానలు
posted on Dec 2, 2015 8:41AM
చెన్నై నగరాన్ని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే వానలు ఏస్థాయిలో కురుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చును. చెన్నై నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో బస్సులు, రైళ్ళు రద్దయ్యాయి. జాతీయ విపత్తుల సహాయ కేంద్రానికి చెందిన 8 బృందాలు తుఫాను ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఆర్మీకి చెందిన రెండు దళాలు చెన్నైలోని తాంబరం మరియు ఉరపాక్కం ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడి అవసరమయిన సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.
నటుడు సిద్దార్ధ ఇంటిలోకి కూడా నీళ్ళు వచ్చేయడంతో అతను కూడా వేరే ఇంట్లోకి మారిపోయాడు. అతను తన స్నేహితుడు బాలాజీతో కలిసి నేటి నుండి సహాయ చర్యలలో పాల్గొనబోతున్నారు. బాధితులను తరలించేందుకు ప్రజలు తమ వాహనాలను తీసుకొని రావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేసాడు. అలాగే భాదితులకు నగరవాసులు తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించాలని పిలుపునిచ్చారు. దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నత వర్గాల ప్రజలు కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.