అమరావతి కోసం డెవలపర్.. టీడీపీ లో కీలకమైన మార్పులు
posted on Jul 27, 2015 3:39PM
ఏపీ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ నమూనాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్యమంత్రి ఈశ్వరన్ అందించిన సంగిత తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ఈ రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నీ రోజులు పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. సాధ్యమైనంత త్వరలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డెవలపర్ ను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతిని నిర్మించనున్నారు. ఇప్పటికే అమరావతికి పక్కావాస్తు కుదిరిందని.. పరిశ్రమలు నిర్మాణానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఏపీ రాజధాని అమరావతి భూకంపాల జోన్ 3.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అధిపతి చెప్పారు. ఏపీ రాజధాని అవరావతిలో కొంత కృష్ణాతీర ప్రాంతంలో కూడా ఉంది కాబట్టి.. తీర ప్రాంతాలు జోన్ 3 కిందకు వస్తాయని చెబుతున్నారు. ఈనేపథ్యంలో రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా కట్టడాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదిలా ఉండగా టీడీపీ లో పలు కీలకమైన మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసి వేర్వేరుగా అధ్యక్షులను నియమించనున్నారు. ఈమేరకు ఇప్పటికే పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే రెండు కమిటీలకు సంబంధించి అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పొలిట్ బ్యూరో ఉండనుంది. దీనిని కూడా త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు లేదా అశోక్ గజపతి రాజు పేర్లను పరిశీలిస్తున్నారని తెలంగాణలో మాత్రం ప్రస్తుతం ఉన్న వారే ఉండనున్నారని తెలుస్తోంది.