రాష్ట్ర విద్యుత్ పరిస్థితి నాడు-నేడు-రేపు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై నిన్న శ్వేతపత్రం విడుదలచేశారు. ఒకప్పుడు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం, నేడు విద్యుత్ లోటుతో ఏవిధంగా అవస్థలు పడుతోందో గణాంకాలు, కారణాలతో సహా వివరించారు. 1996-2004వరకు సాగిన తెదేపా పాలనలో పరిస్థితికి, 2004-2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనలో విద్యుత్ పరిస్థితులకి మధ్య వచ్చిన స్పష్టమయిన తేడాను ఆయన వివరించారు.

 

తమ హయంలో ధర్మల్ విద్యుత్ ఉత్పాదకత 86శాతానికి పెరగగా, అది గత పదేళ్ళలో 78శాతానికి పడిపోయిందని తెలిపారు. తను అధికారం చెప్పట్టే సమయానికి 14.2 శాతం ఉన్న విద్యుత్ లోటును 1.5శాతానికి తగ్గించగలిగానని తెలిపారు. కానీ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వలన ఆ లోటు మళ్ళీ క్రమంగా పెరుగుతూ 2003-04 నాటికి 7.1 శాతం, 2004-14 నాటికి ఏకంగా 17.6శాతానికి చేరుకొందని తెలిపారు.

 

థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో కనీసం బొగ్గు నిల్వలు కూడా ఉంచుకోవాలనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తత్ఫలితంగా తరచూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడటాన్ని ఆయన గుర్తుచేశారు. తమ హయాంలో అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద నెల రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉంచితే నేడు ఎక్కడా కూడా ఒక్కరోజుకు సరిపోయే బొగ్గు నిల్వలు లేవని తెలిపారు.

 

విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినందునే నేడు ఈ దుస్థితి కలిగిందని, రాష్ట్ర విభజన కూడా జరగడంతో రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన విద్యుత్ కూడా దక్కకపోవడంతో నేడు రాష్ట్రం విద్యుత్ కోతలతో అల్లాడిపోతోందని వివరించారు. తమ హయంలో వ్యవసాయానికి 9గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే, నేడు గృహావసరాలకు కూడా విద్యుత్ ఈయలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యలన్నిటినీ తమ ప్రభుత్వం పరిష్కరించి మళ్ళీ రాష్ట్రానికి మిగులు విద్యుత్ తప్పక సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

 

ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక మార్లు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యి రాష్ట్రానికి అనేక వరాలు రాబట్టారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి: విజయవాడ, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పతి సంస్థల ఉత్పత్తి పెంపుదల కోసం విస్తరణ పనుల నిమిత్తం రూ.10,426 కోట్లు, రాష్ట్రంలో వివిధ విద్యుత్ సంస్థల అభివృద్ధికి రూ.7842 కోట్ల రుణం సాధించారు. అదేవిధంగా కృష్ణపట్నంలో ధర్మల్ విద్యుత్ కేంద్రం విదేశీబొగ్గు ధరలు పెరిగిన కారణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలియగానే, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో మాట్లాడి మహారాష్ట్రలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుండి ఏడాదికి 4లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకోనుంది.

 

వివిధ రాష్ట్రాల నుండి బొగ్గు తెచ్చుకొనేందుకు తగినన్ని వేగన్లు లేకపోవడం చేత కూడా బొగ్గు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతుండటంతో, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో మాట్లాడి యన్టీపీసీలకు చెందిన వేగన్లను వాడుకొనేందుకు అనుమతి పొందారు. అదిగాక కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి రాష్ట్రానికి 177మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు, నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు క్రింద మరో 500మెగావాట్స్ సరఫరాకు కేంద్రం అంగీకరించింది. అంతే గాక రాష్ట్రంలో భారీ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

 

గత పదేళ్ళలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ అవినీతి, అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొంది. కానీ చంద్రబాబు నాయుడు అధికారం చెప్పట్టగానే, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం అందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుండటంతో, బహుశః మరి కొన్ని నెలలలోనే ఈ తీవ్ర విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడవచ్చనిపిస్తోంది.