బాబు సవాల్‌తో తోక ముడిచిన జగన్: టీడీపీ

హైదరాబాద్: తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సవాల్‌తో జగన్ తోక ముడిచారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మహానాడు ముగింపు కార్యక్రమం సందర్భంగా అన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే ఎంత మంది సభ్యులు ఉండాలో జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అవిశ్వాసానికి ఎంత మంది మద్దతు ఉండాలో తెలియని జగన్ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. జగన్‌కు దమ్ముంటే గవర్నర్ వద్దకు తన శాసనసభ్యులను తీసుకు వెళ్లి అవిశ్వాసం లేఖ ఇప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జగన్ కాంగ్రెసు పార్టీ పంచన చేరడం ఖాయమన్నారు. కేంద్రమంత్రులు సైతం జగన్ మావాడు అంటున్నారని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతున్న జగన్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ దుకాణం బందు చేసుకోవాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చంద్రబాబు సవాలుతో జగన్ నోరు మూత పడిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఓ రాజకీయ దళారి అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ మాఫియా లీడర్ అన్నారు. జగన్ దోపిడీ సొమ్ముతో ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణ పేరుతో ప్రజలను వంచిస్తున్న కెసిఆర్, రాష్ట్రాన్ని దోచిన జగన్‌పై అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెసు పార్టీని పాత పాపాలు వెంటాడుతున్నాయని అన్నారు. జగన్ ఓ కలుపు మొక్క అని మరో నాయకుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. సర్కారును పడగొట్టే శక్తి ఒక్క టిడిపికే ఉందన్నారు. తాము అవసరమైన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారు. కాంగ్రెసు పాలనలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu