లక్ష్మీపార్వతికి మంత్రి పదవి.. జగన్ మాస్టర్ స్ట్రోక్

 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అనేకమంది నేతలు జగన్ మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవుల రేసులో పలువురు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీడీపీని, చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా జగన్ కొందరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి జగన్ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న లక్ష్మీపార్వతి.. చంద్రబాబును టార్గెట్ చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు మంచి ప్రాధాన్యం ఉంటుందని ఆమె తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు సమాచారం. ఏపీలో వైసీపీ గ్రాండ్ విక్టరీ సాధించడంతో.. లక్ష్మీపార్వతికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

అసెంబ్లీలో లక్ష్మీపార్వతి మంత్రిగా ఉంటే.. చంద్రబాబు, టీడీపీ మరింతగా ఇబ్బందిపడటం ఖాయమనే భావనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆమెను జగన్ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి లక్ష్మీపార్వతికి నిజంగానే మంత్రి పదవి దక్కుతుందో లేదో చూడాలి.