బీఆర్ఎస్ కు షాక్.. ఏపీలో కారు గుర్తు లేనట్టే!?

ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని భావించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి భారీ షాక్ తగిలింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేయడానికి విశాఖ ఉక్కును ప్రచారాస్త్రంగా మలచుకుని ముందుకు సాగాలని యత్నిస్తున్న సమయంలో  ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇంతకాలం కొనసాగిన ‘రాష్ట్ర పార్టీ’ హోదాను  రద్దు చేస్తున్నట్లు  ఎన్నికల సంఘం ప్రకటించింది.

 ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ పార్టీగా గుర్తింపు పొందిందని, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తగిన ఆర్హతలను సాధించడంలో బీఆర్ఎస్ విఫలం అవ్వడంతో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీహోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్ర హోదాను ఎందుకు తీసేయకూడదంటూ మూడుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో పేర్కొంది. 

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్ 1968 లోని సెక్షన్ 6-ఏ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి స్టేట్ పార్టీ స్టేటస్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి  పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఏదేని పార్టీ రాష్ట్ర పార్టీగా కొనసాగాలంటే నిర్దుష్టమైన నిబంధనలు, అర్హతలు, ప్రమాణాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ అర్హతలను పొందలేకపోయిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పోటీచేయలేదని, దీంతో అస్సలే ఓట్లు పడలేదని, దీంతో రాష్ట్ర పార్టీకి ఉండాల్సిన అర్హతలు సాధించలేకపోయిందన్నారు.

స్టేట్ పార్టీ హోదాకు సంబంధించి ఎప్పటికప్పుడు గుర్తింపుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు.  తొలిసారి 2019 జూలై 18న బీఆర్ఎస్ పార్టీకి తొలి షోకాజ్ నోటీసు జారీచేసి, ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ పార్టీ హోదాను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని,   దీంతో 2021 డిసెంబరు   27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీకి లేఖ రాశామని పేర్కొన్నారు.

దానికి కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా లేదని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఆ తరువాత ముచ్చటగా మూడో సారి ఈ ఏడాది మార్చి 7న మరో లేఖలో.. అదే నెల 20 ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరామనీ, కానీ అప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి స్పందన లేదనీ, ఆ సమావేశానికి ఆ పార్టీ  తరఫున ఎవరూ హాజరు కాలేదనీ పేర్కొన్నారు.

 దీంతో నిబంధనలకు విరుద్ధంగా స్టేట్ పార్టీ హోదాను కొనసాగించడం వీలు కాని కారణంగా ఆ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసినట్లువివరించారు.  దీంతో  బీఆర్ఎస్ ఇకపైన ఏపీలో పోటీ చేస్తే కామన్ సింబల్ అంటే కారు గుర్తు దక్కడం దాదాపు అసాధ్యమే.  తెలంగాణలో కారు గుర్తుమీద పోటీ చేస్తున్నా ఏపీలో అలాంటి అవకాశం ఉండదు. అయితే ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ణప్తి చేస్తే  ఎన్నికల సంఘం అందుకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu