బడ్జెట్ సెషన్ అదానీయార్పణం!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అదానీయార్పణం అయిపోయాయి. గత గురువారంతో ముగిసిన బడ్జెట్ సమావేశాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ రోజులు మాత్రమే జరిగాయి. అదే విధంగా సభా కార్యక్రమాలు  అత్యంత ముఖ్యమైన వార్షిక బడ్జెట్‌ ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం పొందిన సందర్భం కూడా ఇదే కావచ్చునని అంటున్నారు.

సాధారణంగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనల మీద సుదీర్ఘంగా, లోతుగా చర్చలు, వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ఏకాభిప్రాయం గనుక సాధ్యమైతే మార్పులు, చేర్పులు కూడా చోటు చేసుకుంటాయి. అయితే, ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో అసలా ఊసే లేదు. జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలన్న స్ఫుృహ అటు అధికార, ఇటు విపక్ష సభ్యులలో కనిపించలేదు.  అదానీ-హిండన్‌బర్గ్‌ కు సంబంధించిన వ్యవహారాలపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని, దీని మీద కూడా చర్చ జరగాలని అవి వాదించాయి. అదానీ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

ప్రతిపక్షాల ఒత్తిడికి, డిమాండ్లకు పాలక పక్షం ఏమాత్రం తలవంచలేదు. ప్రతిపక్షాల డిమాండ్లన్నిటినీ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించింది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీనివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పైగా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి కూడా దిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం సన్నగిలుతోందని, ఈ పరిస్థితిని నివారించడానికి ఇతర దేశాలు సహాయం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో విజ్ఞప్తి చేసినందుకు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ పాలక పక్షం పట్టుబట్టింది. తాను అటువంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేసిన రాహుల్‌ గాంధీ, దానిపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.

రాహుల్‌ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ బీజేపీ పక్ష సభ్యుడు స్పీకర్‌కు లేఖ రాయడం జరిగింది. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. దీనిపై ప్రతిపక్షం గందరగోళ పరిస్థితి సృష్టించడంతో పార్లమెంట్‌ సమావేశాలు స్తంభించిపోయాయి.

 ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించడం అన్నిటికన్నా ముఖ్యమనే ప్రాథమిక విషయాన్ని అధికార, విపక్షాలు పూర్తిగా విస్మరించడం వల్లనే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎటువంటి చర్చా లేకుండా ముగిశాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu