పోలవరం ప్రాజెక్టు పై శ్వేత పత్రం విడుదల

పోలవరం ప్రాజెక్టుకై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం వాస్తవ పరిస్థితులను ఈ శ్వేత పత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో  సాగునీటి రంగ నిపుణులు, మేధావులు అందరి సలహాలు తీసుకుని జగన్ పాలనలో అస్తవ్యస్థంగా మారిన అన్ని వ్యవస్థలు, రంగాలకు గాడిలో పెడతామనీ, గత ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజల కళ్లకుకట్టేలా ఏడు శ్వేత పత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు వాటిలో మొదటిగా పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. చేసిందంతా చేసి మళ్లీ ఎదురు దుష్ప్రాచారం చేస్తున్న వైసీపీ కపటత్వాన్ని ప్రజల ముందుంచేందుకు శ్వేతపత్రాలు దోహదపడతాయని అన్నారు.  పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం, నిజానికి  విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్  ఐదేళ్ల పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లింది. 

2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం - వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పోలవరం కోసం ఖర్చు పెట్టింది కేవలం రూ.4,167 కోట్లు  అని వివరించిన చంద్రబాబు, జగన్ మూర్ఖత్వం, అజ్ణానం, అసమర్థత కారణంగా ఓ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.  కాంట్రాక్టర్లను మార్చవద్దని పీపీఏ హెచ్చరించింది అయినా ఆ హెచచరికలను పెడచెవిన పెట్టి జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం ప్రాజెక్టు పురోగతిని రివర్స్ చేసేశారని చంద్రబాబు విమర్శించారు.  తెలుగుదేశం హయాంలో  72 శాతం పూర్తయిన పోలవరం పనులు.. జగన్ హయాంలో ఒక్క అడుగు కూడా ముందకు కదలలేదని చంద్రబాబు ఉదాహరణలో సహా తెలిపారు.

పనులు చేయకపోగా, పోవలరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సర్కార్ పక్కతోవ పట్టించిందని విమర్శించారు.  అంతర్జాతీయ, దేశీయ నిపుణుల సాయంతో సమస్యను అధిగమిస్తాం . కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లు అధిగమించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  పోలవరం ఎత్తు విషయంలో రాజీ  ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.