చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోన్లూ ట్యాపింగ్?.. జగన్ కు కేసీఆర్ సర్కార్ హెల్ప్?

తెలంగాణలో  ప్రకంపణలు సృష్టిస్తున్న  ఫోన్ ట్యాపింగ్  ఆంధ్రప్రదేశ్ నూ వదల లేదా?.  తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం వద్ద కూడా  ట్యాపింగ్ వాహనం ఏర్పాటు చేశారా? అంటే అందుతున్న సమాచారం మేరకు ఔనన్న సమాధానమే వస్తున్నది.  హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతల  ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చేరవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం లక్ష్యంగా ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఏపీలో తెలుగుదేశం వ్యూహాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీకి సహకరించే ఇండస్ట్రియలిస్టులు ఎవరు?  ఆ పార్టీకి ఎవరెవరి నుంచి నిధులు అందుతున్నాయి అన్న విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి వాటిని ఎప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్ కు చేరవేసినట్లుగా పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  అలాగే జనసేనాని పవన్ కల్యాణ్,  జగన్ చెల్లెలు షర్మిలల నివాసాల వద్ద కూడా ఫోన్ ట్యాపింగ్ కోసం వాహనాలు ఏర్పాటు చేసి మరీ వారితో ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు?  ఎవరెవరు కలుస్తున్నారు?  వారికి అండదండలు అందిస్తున్న ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఇత్యాది వివరాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేసినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ ప్రణీత్ రావు, రాధాకిషణ్ ల విచారణలో వెల్లడైందని అంటున్నారు.  

ఇక వైసీపీ రెబల్ ఎంపీ జగన్‌పై తిరుగుబాటు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నివాసం వద్దకు  ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు వెళ్లేందుకు అనుమతించిన నాటి బీఆర్‌ఎస్ సర్కార్ ఆయన ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు.

 రఘురామకృష్ణం రాజు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ పలు సందర్భాలలో ఫిర్యాదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.   తన మిత్రుడైన జగన్ కు సహాయపడేందుకే హైదరాబాద్ లోని ఏపీ రాజకీయ నాయకుల ఫోన్ లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని జగన్ కు చేరవేయడం వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రతిఫలంగానే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు సాగర్ డ్యామ్ వద్ద హై డ్రామాకు జగన్ తెరలేపారనీ, తద్వారా ఆ ఎన్నికలలో కేసీఆర్ కు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu