నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం
posted on Jan 13, 2026 1:26PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో మంగళవారం (జనవరి 13) సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు గ్రామం అంతా కలియదిరుగుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

నారావారి పల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. ముగ్గులు పోటీలు, క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. అలాగే ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సన్మానించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.




