బాబు అభివృద్ధి నమూనా.... జగన్ విధ్వంసం చిరునామా!

ఏపీలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం స‌హ‌కారంతో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక‌వైపు అమ‌రావ‌తి రాజ‌ధాని, మ‌రోవైపు పోల‌వ‌రం నిర్మాణం ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి బాట‌లు వేసేలా కృషి చేస్తున్నారు. బాబు దూకుడును చూసి వైసీపీ అధినేత జ‌గ‌న్ , వైసీపీ నేత‌లు కంగుతింటున్నారు.

2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆరు నెల‌ల వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌లేదు. కానీ, చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన‌ మ‌రుస‌టి రోజు నుంచి రాష్ట్రాభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. ఫ‌లితంగా మేనిఫెస్టోలోని హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తుండ‌టంతో పాటు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను తీసుకొచ్చి ప‌నులు వేగంగా జ‌రిగేలా చూస్తున్నారు.

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారంటే రాష్ట్రానికి నిధులు రావ‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌కు ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. అయితే, గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌ధానితో భేటీతో పాటు.. కేంద్ర మంత్రుల‌నుకూడా నామ‌మాత్రంగా క‌లిసి వ‌చ్చేవారు. కేవ‌లం త‌న సొంత ప‌నులు పూర్తిచేసుకునేందుకు వెళ్లార‌న్న‌ట్లుగా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగుతూ వ‌చ్చింది. ఢిల్లీ వెళ్లివ‌చ్చిన త‌రువాత మీడియా స‌మావేశం పెట్టి.. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్ద‌ల‌తో ఏయే విష‌యాల‌పై చ‌ర్చించాం.. రాష్ట్రానికి ఏ రంగానికి నిధులు రాబోతున్నాయ‌నే విష‌యాల‌ను గత వైసీపీ ప్ర‌భుత్వం గోప్యం ఉంచింది.

చంద్ర‌బాబు మాత్రం ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌రువాత ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల‌తో ఏఏ అంశాల‌పై చ‌ర్చించామ‌నే విష‌యాలను మీడియా ముఖంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తీవిష‌యంలో జ‌వాబుదారీత‌నంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌కంలో పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది న‌చ్చ‌ని జ‌గ‌న్   సొంత మీడాయా, సోషల్ మీడియా ద్వారా అస‌త్య ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కుల స‌మావేశంలో మాట్లాడుతూ.. మా హ‌యాంలో అది చేశాం.. మా హ‌యాంలో ఇది చేశాం అంటూ తన భుజాలను తానే చరుచుకున్నారు. చేయ‌ని ప‌నులు కూడా చేశామ‌ని  చెప్పుకుని క్రెడిట్ ను ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. ఎంత చేసినా జనం ఓడించారంటూ ఆవేదనా ఒలకబోసి డ్రామాను రక్తికట్టించడానికి ప్రయత్నించారు. 

అయితే వాస్త‌వానికి ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఇదీ మేం చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ లేదు.  ఉద్యోగ ఉపాధి అవకాశాలు   చేసుకోవటానికి ప‌నులు లేక.. ప్ర‌భుత్వం నుంచి స‌హ‌ కారం అంద‌క ప్ర‌జ‌లు న‌ర‌క యాత‌న అనుభ‌వించారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో కనీసం రోడ్ల మ‌ర‌మ్మ‌తు పనులు కూడా జరగలేదు. వాటన్నిటినీ విస్మరించి జ‌గ‌న్ తాను  నెల‌నెలా త‌న సొంత జేబులో నుంచి డ‌బ్బులు ఇచ్చాను అన్న‌ట్లు గా అరకొరగా పంచిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. దీంతో  ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు సైతం  అస‌హ‌నానికి గుర‌య్యారు. ఈవీఎంల‌పైనా మ‌రోసారి జ‌గ‌న్ అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. హర్యానా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. కానీ, కాంగ్రెస్ ఓడిపోయి వ‌రుస‌గా మూడోసారి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఈవీఎంల‌పై నెపాన్నినెట్టే ప్ర‌య‌త్నం చేశారు. దేశంలో ఎక్క‌డ ఈవీఎం ముచ్చ‌ట వినిపించినా దానిని ఏపీకి చుట్టేయ‌డం జ‌గ‌న్‌, ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటుగా మారిపోయింది. దీంతో ఏపీలో ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు జ‌రిగింద‌ని చెబుతూ.. హ‌రియాణాలోనూ బీజేపీ ఈవీఎంల మ‌త‌ల‌బుతోనే గెలిచిదంటూ జ‌గ‌న్‌ ఆరోపణలు గుప్పించేశారు. 
 
2019లో వైసీపీ గెలిచిన స‌మ‌యంలో కొంద‌రు తెలుగుదేశం నేత‌లు ఈవీఎంలలో మ‌త‌ల‌బు వ‌ల్లే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిదంటూ వాదించారు. జ‌గ‌న్ వారిని తీవ్రంగా ఖండించారు. ఈవీఎంలు ప‌విత్ర‌మైన‌వి అన్న‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడారు. కానీ, ఇటీవ‌ల అధికారాన్ని కోల్పోవ‌డంతో  త‌మ అస‌మ‌ర్ధ పాల‌న‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ఓట‌మి నెపాన్ని ఈవీఎంల‌పై నెట్టే ప్ర‌య‌త్నాల‌ను గత నాలుగు నెలలుగా జ‌గ‌న్ కొన‌సాగిస్తూనే  ఉన్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టినా త‌న తీరును మార్చుకోవ‌టం లేద‌ని, త‌న తీరును ఇప్ప‌టికైనా మార్చుకోక‌పోతే  ఇక రాష్ట్రంలో వైసీపీ కనుమరుగయ్యేందుకే అవకా శాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.