వైఎస్ వివేకా హత్య కేసు.. ముగిసిన సీబీఐ దర్యాప్తు.. సుప్రీంకు నివేదన
posted on Aug 5, 2025 12:51PM
.webp)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది. ఈ విషయాన్ని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. సీబీఐ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు ఈ మేరకు తెలియజేస్తూ.. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా దేశ సర్వోన్నత న్యాస్థానానికి సమర్పించారు. సుప్రీం కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇటీవలే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడు అంశాలపై అభిప్రాయం తెలపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐను ఆదేశించిన సంగతి విదితమే. ఆ అంశాలపై సీబీఐ అభిప్రాయం తెలిపిన తరువాతనే వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై విచారణ చేపడతామని ఆ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ సుప్రీం కు తెలియజేయడంతో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది.