హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు!
posted on May 23, 2023 12:09PM
హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్ అధికారికి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిందంటూ డింపుల్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించిన డింపుల్.. అధికార దుర్వినియోగంతో తప్పులను దాచలేరు అని కామెంట్ చేసింది.
జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో డింపుల్ హయాతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ వాహనాన్ని ఆయనకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే డింపుల్, డేవిడ్ లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు.
అయితే పదేపదే డీసీపీ వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారట. అంతటితో ఆగకుండా డింపుల్ తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టగా, ఈ ఘటనలో ఆయన కారు ముందు భాగం దెబ్బతిన్నదట. దీంతో డింపుల్ పై చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులకు సమర్పించాడు. పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డింపుల్ తీరు మారలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ వివాదంపై డింపుల్ స్పందన మరోలా ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు దాచిపెట్టాలని చూస్తున్నారని, సత్యమేవ జయతే అంటూ ఆమె ట్వీట్ చేసింది.