పరారీ యత్నాల్లో అవినాష్.. అస్పత్రి సీన్ అందుకేనా?

అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే.. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని ఆయనే స్వయంగా అంగీకరిస్తున్నట్లుగా అనిపించకమానదు. లేకుంటే సీబీఐ అరెస్టు చేస్తుందేమోనని అంతగా భయపడాల్సిన అవసరమేంటో అర్థం కాదు. ఇదే వివేకా హత్య కేసులో స్వయానా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.  

ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందన్న ప్రచారమూ చేసుకున్నారు. అయినా సీబీఐ ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి మరీ జైలుకు తరలించింది. మరి తన వద్దకు వచ్చే సరికి అవినాష్ ఎందుకు వణికిపోతున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్ లా మూకలను అడ్డుపెట్టుకుని ఎందుకు దాక్కుంటున్నారు. తల్లి అనారోగ్యం పేరు చెప్పి ఒక ఆస్పత్రినే యుద్ధభూమిగా మార్చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద పరిస్థితి చూస్తే.. ఆ ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులను హోస్టేజీలుగా పట్టుకుని జగన్ రెడ్డి సీబీఐ తన వద్దకు రాకుండా నిలువరిస్తున్నారా? అన్న అనుమానం కలుగక మానదు. ఇక ఆయన చివరి ఆశ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ విచారణ. ఆ విచారణలో కూడా అవినాష్ కు  ఊరట లభించకుంటే..ఇక ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లడమే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పులివెందుల నుంచి తల్లిని కర్నూలు తీసుకు వచ్చే విషయంలో కూడా ఆయన సీబీఐ సహా అందరినీ కన్ఫ్యూజ్ చేసేలాగే వ్యవహరించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఆయన కనుక తన తల్లిని కర్నూలు తీసుకువస్తున్నట్లు ముందుగానే సీబీఐకి సమాచారం ఇచ్చి బయలుదేరి ఉంటే.. విశ్వభారతి ఆసుపత్రి అవినాష్ అనుచరుల కబ్జాలోకి వెళ్లే అవకాశం వారిచ్చి ఉండేవారు కాదని, అప్పుడు అవినాష్ కు తప్పించుకునే అవకాశాలు ఉండేవి కావనీ అంటున్నారు. ఒక వైపు సీబీఐ బృందాలు ఛేజ్ చేస్తుండగా అండర్ గ్రౌండ్ కు వెళ్లే అవకాశం ఉండదన్న భావనతోనే ఆయన విశ్వభారతి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారనీ, సుప్రీంను ఆశ్రయించడం, 27 వరకూ గడువు ఇవ్వాలంటూ సీబీఐని కోరడం ఇవన్నీ కూడా తప్పించుకునే వ్యూహంలో భాగమేనని అంటున్నారు.

సుప్రీం కోర్టులో ఒక వేళ ఆయనకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు విచారణ పూర్తయ్యే వరకూ అరెస్టు నుంచి రక్షణ లభిస్తే.. ఆ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి ఉద్దేశమే లేకుంటే.. అవినాష్ ఈ పాటికే సీబీఐ విచారణకు హాజరై ఒక వేళ సీబీఐ ఆయనను అరెస్టు చేసినా న్యాయస్థానాలలో బెయిలు కోసం ప్రయత్నించే వారనీ అంటున్నారు.

అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లి బయటకు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకు భిన్నంగా సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారంటే వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సీబీఐ ఇప్పటికే సేకరించిందన్న సమాచారం ఆయనకు అందడమే కారణమంటున్నారు. అందుకే సీబీఐ అధికారులు తన సమీపానికి కూడా రానీయని విధంగా అవినాష్ రెడ్డి తనకు రక్షణగా ఆస్పత్రి వద్ద తన అనుచరులు, వైసీపీ మూకలను మోహరింపచేశారని అంటున్నారు.