జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ లో క్యాన్సర్ కారకాలు..అమ్మకాల నిలిపివేత

చిన్నారులకు అవసరమయ్యే అన్ని ప్రాడెక్ట్స ను ఉత్పత్తి చేసి విక్రయించే సంస్థ ఏది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది జాన్సన్ అండ్ జాన్సన్. సబ్బు నుంచి చిన్నారుల కోసం ఉపయోగించే టవల్స్, ఆయిల్, మాయిశ్చరైజర్స్, డైపర్స్  ఇలా  పువ్వుల్లాంటి తమ చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఉప యోగించే ప్రతి వస్తువూ జన్సన్ అండ్ జాన్సనే బ్రాండ్ ను ఉపయోగించేవారు కోకొల్లలు.

అలాంటిది ఇప్పుడు జన్సన్ అండ్ జాన్సన్ ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ టాల్క్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించే ఆస్ బెస్టాస్ ఒవేరియన్లో  క్యాన్సర్  కారకాలున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయంటూ దాదాపు 38వేల కేసులు నమోదయ్యాయి. అయితే క్యాన్సర్ కారకాల ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ ఖండించింది. తాము ఉత్పత్తి చేసే బేబీ టాల్కం పౌడర్ సురక్షితమైనదేనని వైద్య నిపుణులు నిర్ధారించారనీ చెబుతోంది. అయినా వినియోగదారుల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది.

దీంతో వచ్చే ఏడాది తరువాత ఈ సంస్థ విక్రయిస్తున్న బేబీ టాల్కమ్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ బేబీ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ ని వినియోగించాలని నిర్ణయించింది. అదలా ఉంచితే రెండేళ్ల కిందటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను అమెరికా, కెనడాలలో నిలిపివేసింది.