సుప్రీం పర్యవేక్షణలో వివేకా హత్య కేసు దర్యాప్తు!

ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం టీవీ సీరియల్ లా సా...గుతోంది. రోజుకో కుదుపు.. పూటకో మలుపులా ఈ కేసు విచారణ తీరు మారింది. సీబీఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత  సుప్రీంను ఆశ్రయించారు.  

తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగాలని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని  ఆమె ప్రతివాదులుగా  చేర్చారు. అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిన తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని  తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.

2019 మార్చి 15న   వివేకానందరెడ్డిని పులివెందులలోని తన నివాసంలోనే దారుణం హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఈ ఐదుగురి పేర్లు తెర మీదకు వచ్చినా.. వీరి వెనక సూత్రధారులు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగి మూడేన్నరేళ్లు పూర్తయినా ఇంకా దోషులెవరనేది తేలనే లేదు.

అయితే.. తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పట్టు వీడకుండా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఉల్టా కేసులు వేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పై బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలతో  విచారణ నత్తనడక నడుస్తోంది. దీంతో సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ వేశారు.