లీ.. బ్రూస్ లీ!
posted on Jul 20, 2022 7:46AM
మనిషి శక్తిసామర్ధ్యాలకు అంతే ఉండదు. ప్రతీవారిలో ఆ శక్తి ఉంటుందని అంటారు. కానీ చాలాతక్కువ మందే దాన్ని గ్రహించుకోగల్లుతారు. ఊహాతీతంగా ఆ శక్తియుక్తులే ఇతరులకు అతీతంగా తయారు చేస్తాయి. ఇది కళాకారుడిని చేయవచ్చు, కుంగ్ ఫూ పైటర్‌గానూ చేయవచ్చు. రెప్పపాటులో శరవేగంగా శరీరావయవాలను కదిపి ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల అపార సామర్ధ్యం పొందడం బ్రూస్ లీకి మాత్రమే సాధ్యపడింది. అతనికి ముందు, ఆ తర్వాత మరెవ్వరూ లేరన్నది యావత్ ప్రపంచ ఫైటర్లూ, యువతా అంగీకరిస్తున్నారు. బహు శాంతంగా కనిపించే బ్రూస్‌లీ లో ఇంతటి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ కదలికలు కేవలం భగవత్ కృపతోనే సాధ్యపడిందనే వాదనా ఉంది. ఏమైనప్పటికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంటర్ ద డ్రాగన్!
లీ అసలు పేరు లి జున్ ప్యాన్. 1940 నవంబర్ 27న శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్‌లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్‌వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్ గెలుచుకున్నాడు. హాంగ్‌కాంగ్‌లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతనిలో ఏదో అతీత శక్తి ఉందన్న ప్రచారం కూడా బాగానే ఉండేది. ఊహించని అతివేగవంత కదలికల్లోనే అతనికి తెలీని శక్తి దాగిందనే వాదన పెద్ద చర్చగా ఉంది.
మనిషి తన శక్తిసామర్ధ్యాలను అనుసరించి జీవించడంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడనేవాడు లీ. అంతర్జాతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అతన్ని ఎంతో మార్చిందన్న వాదనా ఉంది. అతనిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వచ్చిందంటారు. అతనిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్రహించారు. కేవలం ఆత్మరక్షణకే యుద్ధకళలను నేర్చకు న్నాడే గాని ఇతరులను ఇబ్బందిపెట్టడానికి కాదని, అతని జీవితాన్ని గమనిస్తే తెలుస్తుందని తోటి నటీ నటులు అంటూండే వారు. గొప్ప వ్యక్తిని, మంచి మిత్రుడిని కోల్పోయానని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్‌కాంగ్‌లో మృతి చెందాడు. చిత్రమేమంటే అతనికి ప్రపంచఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లిందని బంధువులు, యావత్ ప్రపంచ వీరాభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూంటారు. లీ లాంటి వ్యక్తులు మళ్లీ జన్మిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమనే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.