కేసీఆర్ గర్జన.. ఇచ్చిపడేసిన రేవంత్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు
posted on Feb 1, 2025 2:27PM

ఇదిగో వస్తున్నా.. ఇక నుంచి సమరమే.. బహిరంగ సభ పెడతా.. మన కొడితే దెబ్బ ఎంతగట్టిగా ఉంటుందో అధికార పార్టీకి చూపిద్దాం.. అంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే చెబుతూ వస్తున్నారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన పెద్దగా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవటంతో గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ తీరుపట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. కేసీఆర్ రంగంలోకి దిగితే ఆ లెక్క వేరేగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫాంహౌస్ లో ఉంటున్న కేసీఆర్‌ను ఆ పార్టీ నేతలు కలిసినప్పుడు ఆయన రేవంత్ సర్కార్ పై పరుషంగా మాట్లాడటం.. ఇక వస్తున్నా కాసుకోండి అంటూ హెచ్చరించడం, ఆ వీడియోను సదరు నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడం.. ఇలా ఏడాదికాలంగా పరిపాటిగా మారింది. కేసీఆర్ మాత్రం బయటకు వచ్చి రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. తాజాగా.. మరోసారి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జన చేశారు. ఫిబ్రవరి చివరిలో పెద్ద సభ పెడదాం.. కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నా.. నేను దెబ్బ కొడితే గట్టిగానే కొడతా అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కేసీఆర్ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మట్లాడిన కేసీఆర్.. రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు. తాను మౌనంగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాన్ని, దాని తీరునూ గమనిస్తూనే ఉన్నా, నేను కొట్టడమంటూ జరిగితే మామూలుగా ఉండదు అంటూ కేసీఆర్ ఫిబ్రవరి నెల చివర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. కాళేశ్వరం, బసవేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. ఎవడో చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు.. కైలాస ఆటలో పైకి పోయిన తర్వాత పెద్ద పాము మింగినట్టు రాష్ట్ర పరిస్థితి తయారయింది. కరోనా సమయంలో కూడా తాను రైతు బంధు ఇచ్చాను. రైతులకోసం ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు అంతా గంగలో కలిసిపోయింది. ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ విలువ తెలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిన పోల్ లోనూ రేవంత్ సర్కార్ కు ప్రజలు మద్దతు తెలపలేదు అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు సంతోషపడుతున్నప్పటికీ.. అదే సమయంలో వారిలో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సంతోషం ఎందుకంటే ఆయన రేవంత్ సర్కార్ పై చేసిన విమర్శలు. ఆందోళన ఎందుకంటే.. గత ఏడాది కాలంగా ఇలాంటి విమర్శలే చేస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కేసీఆర్ ఈ సారైనా ఆయన చెప్పిన విధంగా ఫిబ్రవరి చివరిలో బయటకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగిస్తారా అన్న అనుమానం వేధిస్తుండం. అదలా ఉంచితే ముఖ్యమం్తరి రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు.
అబద్ధాలు చెప్పడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారు. ఫాంహౌస్ లో కూర్చుని సోది చెప్పడం కాదు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తే ఏ గ్రామంలో, ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో చెబుతాం. పధ్నాలుగు నెలలుగా ఫాంహౌస్‌లో కూర్చొని గంభీరంగా చూస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అయితే, కేసీఆర్, రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ లు ఎలాఉన్నా.. కేసీఆర్ తాజా వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులే విశ్వసించడం లేదు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్ చాటు నుంచి ప్రకటనలు గుప్పించి కేడన్ లో ఉత్సాహాన్ని నింపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు.. అంతిమంగా పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. కేటీఆర్, హరీశ్ రావులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ నేతలకు అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నారు. అయినా వారి మాటలను పట్టించుకోని కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇలా.. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర పార్టీ పెద్దల వ్యూహాలను రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు అమలు చేస్తూ రోజురోజుకు ప్రజా మద్దతును పెంచుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తీరు కారణంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి మాత్రంగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారైంది. కేటీఆర్, హరీశ్ రావులు పార్టీ క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా నిరోధించడంలో విఫలమౌతున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితేనే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్ముతున్నారు. కేసీఆర్ మాత్రం అధికారం కోల్పోయిన నాటినుంచి పామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. పలు సందర్భాల్లో ఇక రంగంలోకి దిగుతున్నా కాంగ్రెస్ పనిపడదాం అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ కావడం లేదు. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకపోవటంతో ఇక కేసీఆర్ పనిఅయిపోయింది.. రాజకీయాల్లో యాక్టివ్ కావటం కష్టమేనన్న అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారు. అయితే, తాజాగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ పెడదాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకైనా కేసీఆర్ కట్టుబడి ఉంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.