నిర్మలమ్మ పద్దులో తెలంగాణ ఏదీ? ఎక్కడా?

 కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో అసలు తెలంగాణ ప్రస్తావనే లేదు. దేశంలో తెలంగాణ అన్న రాష్ట్రం ఉందన్న సంగతే మరిచినట్లుగా కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ఉందన్న విమర్శలు తెలంగాణ సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా అమలు అయ్యే పథకాలు వినా.. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులూ లేవు.  పెండింగు ప్రాజెక్టుల కోసం కూడా కేంద్రం ఈ బడ్జెట్ లో నిధులు విదల్చలేదు.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధికి బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు కేటాయించి, ఆ నిధులతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్, తెలంగాణలో ఏర్పాటయ్యే ఏఐ సిటీ కోసం మాత్రం పైసా విదల్చలేదు.  దీంతో బడ్జెట్ పై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రిక్తహస్తం మాత్రమే చూపారని దుయ్యబడుతున్నారు.