బీఆర్ఎస్ కు ముహూర్తం కుదిరింది..

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదించేసింది. ఈ మేరకు లేఖ పంపింది. ఆ లేఖపై కేసీఆర్ శుక్రవారం(డిసెంబర్ 9) మధ్యాహ్నం నిర్ణయించిన ముహుర్త సమయంలో సంతకం చేసి ఈసీకి పంపనున్నారు. ఆ తర్వాత ఇక టీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ గా మారిపోతుంది. ఇక నుంచి బీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉంటుంది. టీఆర్ఎస్ ఉండదు. తెలంగాణ ఉద్యమ పార్టీ కాలగర్భంలో కలిసిపోయినట్లే..  

తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ ప్రస్థానం కోసం దశాబ్దాల తెలంగాణ ప్రజల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి) ఉనికి కోల్పోయింది. పార్టీ అంతర్థానమైపోయింది. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్, జాతీయ యాత్ర మొదలైంది. అయితే, అప్పడు ఎన్నికలు ముగిసి అధికారం తిరిగి హస్తగతం అయిన తర్వాత, ఎందుకనో ఆ ఆలోచన అటకెక్కింది. కానీ, హుజూరాబాద్ ఓటమి తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ  జాతీయ ఆలోచనలను అటకమీద నుంచి దించి బూజు దులిపి తెరమీదకు తీసుకు వచ్చారు. ఇక  అప్పటి నుంచి ఒక చేత్తో కేంద్రంతో యుద్ధం చేస్తూ మరో చేత్తో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అదేమిటో కానీ, ఆయన జాతీయ రాజకీయాల ఆలోచన ఆయనకు అచ్చిరాలేదో ఏమో కానీ, ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి ఆలోచనతో ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎవరిని కలిసినా, ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడి కెళితే అక్కడ చుక్కెదురైంది.  

ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్ మార్చారు.  ఫ్రంట్ లేదు టెంట్ లేదంటూ జాతీయ పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. పార్టీ వేదికలు, బహిరంగ్ సభల్లో జాతీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. పెట్టాలా .. వద్దా అంటూ ప్రశ్నించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, చప్పట్లతో ఆమోదం తెలిపారు. అయితే, సామాన్య రాజకీయ పండితుల మొదలు సామాన్య ప్రజల వరకు, కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముడి పడేవి కాదనే అంటున్నారు. అదెలా ఉన్నప్పటికే, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ   చర్చను సజీవంగా ఉంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. 

ఆ ప్రయత్నాలలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు,ప్రజా ప్రతినిధులు, తెలంగాణలో కేసీఆర్ అద్భుత పాలన చూసి మురిసి, ముగ్దులవుతున్నారని,  తమ రాష్ట్రంలోనూ, కేసీఆర్ పాలన కావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు.  కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ప్రచారం చేసుకున్నారు.  అయితే, ఆ ప్రచారంలో భాగంగా వచ్చిన తప్పుడు కథనాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు ఖండించడమే కాకుండా,  ఆ కథనాలు వచ్చన పత్రికలను తగల పెట్టి  మరీ నిరసన తెలిపారు. మహారాష్ట్ర రైతులు అయితే, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తమ నోట్లో మట్టి కొట్టారని, మేడిగట్టు బ్యాక్ వాటర్ తో తమ పంట పొలాలు నీట మునిగి పోతున్నాయని మండిపడుతున్నారు. అలాగే  పెట్టుబడి పెట్టి కర్ణాటక, గుజరాత్ తదిర  బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలను ప్లాన్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘీలా   హైదరాబాద్ వచ్చి వెళ్ళింది అందుకేనని అంటున్నారు. 

అయితే అదెలాగున్నా  ముఖ్యమంత్రి కేసేఆర్ మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో, తగ్గేదే..లే  అంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి  దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన చేసి, తీర్మానం చేసి ఈసీకి పంపిన తరువాత కేసీఆర్ జాతీయ పార్టీ గురించి, జాతీయ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఢిల్లీ లిక్కర కుంభకోణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సన్నిహితునిగా పేర్కొంటున్న, విజయ్ నాయర్’ ను ఆయనతో పాటుగా, ఆయనకు సన్నిహితునిగా భావిస్తున్న, మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రను ఎన్ఫోర్స్మెంట్  డైక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటుగా తెరాస కీలక నేతలు కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి, ఒకింత వెనక్కు తగ్గారా అని కూడా అనిపించింది.

మద్యం కుంభకోణంలో కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం, ఆయన సన్నిహిత బంధువు, ఎంపీ సంతోష్ అండర్ గ్రౌండ్ లో ఉన్నారా అనిపించేలా ఎవరికీ అందుబాటులో లేకుండా, వెళ్లిపోవడంతో కేసీఆర్ వారిని లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి కేంద్రంతో రాజీ కోసం ప్రయత్నాలు చేశారనీ, ఇందుకోసం హస్తిన వెళ్లి మరీ రాయబారాలు నడిపారనీ కూడా కథనాలు వచ్చాయి. చివరాఖరికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ తో తనకు ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని ఆయనను కేంద్ర హోంమంత్రి వద్దకు రాయబారానికి పంపి భంగపడ్డారు.  ఇక తాడో పేడో తేల్చుకోవడం వినా గత్యంతరం లేదని తతేలిపోవడంతో మళ్లీ తెలంగాణలా ఇండియాను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ . టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. తెలంగాణ పార్టీ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి నేరుగా పార్టీ పేరునే మార్చేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసుకునే పరిస్థితిని ఊహించలేనిదయినా కేసీఆర్ సాహసోపేతంగా అడుగు ముందుకేశారు. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది.   తెలంగాణ భవన్లో శుక్రవారం(డిసెంబర్9) ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఎన్నికల సంఘానికి పంపిస్తారు.

 అనంతరం సీఎం కేసిఆర్  బిఆర్ఎస్ జండా  ఆవిష్కరిస్తారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ ఆదేశించారు.