వైసీపీ సమైక్యరాగం.. సజ్జల కొత్త పల్లవి

వైసీపీకి రాజకీయంగానే కాదు...అన్ని రకాలుగానూ దారులు మూసుకుపోయాయి. విధానాల పరంగానైతేనేమి, పాలనా పరంగానైతేనేమీ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఏ వర్గమూ కూడా ప్రభుత్వం ఈ మంచి పని చేసిందీ అని చెప్పుకోలేని పరిస్థితి. బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ము లబ్ధి దారులు కూడా  పప్పు బెల్లాలు పంచి మా ఉపాధిని కొల్లగొట్టిందీ ప్రభుత్వం అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఏ వర్గం కూడా జగన్ పాలన పట్ల సానుకూలత వ్యక్తం చేయని పరిస్థితి ఎమ్మెల్యేల గడప గడపకూ కార్యక్రమంలో సహా ఇటీవలి కాలంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిఫలిస్తోంది. బటన్ నొక్కేందుకు జగన్ ఆర్భాటంగా ఏర్పాటు చేస్తున్న సభలు కూడా జనం లేక వెలవెలబోతున్న పరిస్థితి. రాయల సీమ గర్జన అంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభ రాయలసీమలో సైతం జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిన విషయాన్ని తేటతెల్లం చేసింది. రాయలసీమ గర్జన జరగడానికి రోజుల ముందు అదే కర్నూలులో చంద్రబాబు రోడ్ షోకు జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. దీనిని బట్టే రాష్ట్రంలో జనం మూడ్ ఏమిటే అందరికీ అర్దమైపోయింది. ఇక వైసీపీ బీసీ జయహో అంటూ సభ నిర్వహిస్తే.. జనం రావడం సంగతి అటుంబి బీసీల కోసం నిర్వహించిన ఈ సభలో అధినేత జగన్ సహా ప్రసంగించిన వారెవరూ మూడున్నరేళ్ల జగన్ పాలనలో బీసీలకు చేసిందేమిటో చెప్పు కోలేకపోయారు. అందుకు బదులుగా జయహో బీసీ వేదికను చంద్రబాబు జపం చేయడానికే ఉపయోగించుకున్నారు.   ప్రసంగించిన వారంతా.. చంద్రబాబు బీసీలను మోసం చేశారు.. జగన్‌ న్యాయం చేశారని చెప్పడమే కానీ చంద్రబాబు బీసీలకు చేసిన అన్యాయమేమిటి? జగన్ చేసిన న్యాయం ఏమిటన్నది చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇలా వరుసగా సభలు ప్లాప్ అవుతుండటం, గడపగడపలో ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు ఎదురౌతుండటం.. చివరాఖరికి ఎన్నో ఆశలతో నిర్వహించిన రాయలసీమ గర్జన, జయహో బీసీ సదస్సులు కూడా విఫలం కావడంతో ముఖం కాపాడుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఓ అసందర్భ చర్చను తెరపైకి తీసుకు రావాలి. అదిగో సరిగ్గా అదే చేశారు

సర్వ శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయిన అనంతరం మళ్లీ సమైక్యవాదమంటూ ఓ అసందర్భ చర్చను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.   జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నవరత్నాల స్కీమ్‌లు అమలు చేస్తుందో లేదో కానీ.. డైవర్షన్ స్కీమ్‌ను మాత్రం పక్కాగా అమలు చేస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఒక్కటి కావాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దూమారాన్నే రేపుతున్నాయి.  ఇటీవల కర్నూలులో నిర్వహించిన సీమ గర్జన అయితేనేమీ..  అలాగే జయహో బీసీ సభ అయితేనేమీ.. టోటల్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి... ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మరలించేందుకే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి ఆనవాయితీగా మారిన డైవర్షన్ స్కీమ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అందులో భాగంగానే మళ్లీ.. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కావాలంటూ  విభజన నాటి సమైక్య వాదం అనే పాత పాటను.. కొత్త పల్లవి లాగా అందుకున్నారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల తెలుగు ప్రజలు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు 2004 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ గెలిస్తే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని.. తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్‌గా స్ఫష్టం చేసిందంటే..అదంతా పాదయాత్ర చేసిన ప్రతిపక్ష నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చలవే. అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పురుడు పోసుకుందని.. ఆ ఎన్నికల్లో అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపు..  వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం.. మళ్లీ 2009 ఎన్నికల వేళ.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం తెరపైకి రావడం.. ఆ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేల్లో చాలా మంది హస్తం పార్టీలోకి జంపింగ్ రాగం ఆలపించడం.. వారికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టడం.. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందంటే... ఇదంతా నాడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావన్న సంగతి అందరికి తెలిసినవే.

అదీకాక.. నాడు విభజనకు అనుకూలం అంటూ వైయస్ఆర్ కాంగ్రెస పార్టీ కేంద్రానికి లేఖ సైతం ఇచ్చిందని.. ఆ తర్వాత తూచ్ అంటూ.. విభజనకు తాము అనుకూలం కాదంటూ యూ టర్న్ తీసుకొన్న విషయం ఇక్కడ గమనార్హం. రాజీలు పడడంపైనే కానీ.. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని వై సీపీ నేతలు అధికారం కోసం.. ఏమైనా చెబుతారు ఏమైనా చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు ప్రతిపక్ష నేతగా  జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారోనన్న సంగతి అందరికీ తెలిసిందేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రతిపక్షంలో ఉండి... రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి.. అధికారంలోకి రావడంతోనే.. మూడు రాజధానులు అంటు కొత్త పల్లవి అందుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఇటు కర్నూలులో హైకోర్టు పనులు కానీ..  అటు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పనులు కానీ ఇంకా ప్రారంభించలేదు.  

మరోవైపు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్.. సోదరి   షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టి.. పాదయాత్రలు సైతం చేస్తోంది. ఆ క్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీని సైతం ఆమె టార్గెట్ చేసి... ఆరోపణలు గుప్పిస్తోంది. ఆ క్రమంలో తాజాగా వరంగల్ జిల్లా నరసన్నపేటలో చోటు చేసుకున్న పరిణామాలు, అనంతరం హైదరాబాద్‌లో   షర్మిల అరెస్ట్ ... విడుదల ఎపిసోడ్‌ తెలుగు రాష్ట్రాల్లో బాగా  వైరల్ అయింది. మరోవైపు షర్మిలపై టీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా చేసుకుని దూసుకు పోతున్నారు. ఆ క్రమంలో ఆమెపై కారు పార్టీ వారు.. కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాంటి వేళ.. సజ్జల లాంటి వారు ఇలాంటి కామెంట్స్ చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేననే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో వాడి వేడిగా చర్చ అయితే నడుస్తోంది.

ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమైనా ప్లాప్ అయితే.. ఆ వెంటనే ఈ డైవర్షన్ స్కీమ్ అనే పథకాన్ని పాండవులు జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను కిందకు దింపుకున్నట్లు దింపుకోవడం.. ఆ తర్వాత ఆ పని పూర్తి మళ్లీ ఈ డైవర్షన్ స్కీమ్‌ను చెట్టేంక్కించడం.. ఈ జర్నలిస్ట్ కమ్ ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పెన్ను క్యాప్ తీసి... పెట్టినంత ఈజీ అనే ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.