అప్పుడు ముందస్తుకు వెళ్లడమే ముంచేసిందా?

భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన  జరిగింది. ఆ తరువాత 2014లో తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల ముందే అంటే 2018 డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.  2018 ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ వరుసగా రెండో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. అప్పట్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించగలిగారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే కేసీఆర్ అప్పట్లో ముందస్తుకు వెళ్లడం వల్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక లతో పాటుగా కాకుండా ముందుగానే అంటే 2023 డిసెంబర్ లోనే జరిగాయి. 2018లో కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లడం కలిసి వచ్చింది. కానీ నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 2023 ఎన్నికలలో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు విపక్షాలను చిత్తు చేసిన వ్యూహంగా ప్రశంసలు గుప్పించిన వారే  నేడు నాటి నిర్ణయం వ్యూహాత్మక  తప్పిదంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికే పరిమితం అవ్వడమే కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. ఈ పరాజయం పార్టీ స్థాయినీ, నైతిక స్థైర్యాన్నీ బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఓటమి తరువాత పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. పార్టీ నేతలూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ కూడా పార్టీని వీడుతున్నారు. గత పదేళ్లుగా ఎవరి సలహాలూ, సూచనలూ పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధినాయకత్వం పట్ల బాహాటంగానే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధినేతకు సన్నిహితులుగా గుర్తింపు పొందిన కేకే, కడియం వంటి వారు కూడా కారు దిగేయడంతో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందనా రాకపోవడం చూస్తుంటే ఆ పార్టీ పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అవగతమైంది. ఈ పరిస్థితి రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో ఇంకా పార్టీలో ఉన్న నేతలలో కూడా అంతర్మథనం ప్రారంభమైందని చెబుతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ వ్యూహాత్మకంగా దిద్దుకోలేని తప్పిదం చేశారని బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి తప్పిదానికి ఇప్పుడు పార్టీ ఫలితం అనుభవిస్తోందని అంటున్నారు.