కండువాలూ, ఖర్చులూ మావే .. బీఆర్ఎస్ బంపర్ ఆఫర్
posted on Jan 8, 2023 4:24PM
అదిగో ఆ ..గుండాయన ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు ...అన్నారు, కానీ, అది తప్పు. ఆయన ఏదో తెరాస కాలంలో ఉండి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఏమో,కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ జమానాలో పైసలే కాదు, పార్టీ పదవులు కూడా ‘ఫ్రీ’ గానే వస్తాయి. ఉచిత కడువాలు కప్పుకుంటే చాలు, ఖర్చులే కాదు, కావాలంటే ఎక్స్చేంజి, షేరింగ్ ఆఫర్లు, నజరానాలు అందుకోవచ్చును. అయితే అందుకు కొన్నికండిషన్స్ అప్లయ్ అవుతాయి. షరతులు వర్తిస్తాయన్న మాట.
అయితే అవేమీ మరీ అంత కఠిన షరతులు కూడా కాదు. మీరు అలనాటి లంకలో పుట్టిన రాక్షసులే అయినా ఫర్వాలేదు ... మీకు ఏపీలో కాసింత గుర్తింపు ఉంటే చాలు,అలాగే నాలుగైదు పార్టీలు మారిన అనుభవము ఉంటే అది అదనపు అర్హత అవుతుంది. అలాగే, పోటీ చేసిన ప్రతి ఎన్నికలో ఓడి పోయిన అనుభవము ఉంటే ఇక తిరుగే లేదన్న మాట ... అలాంటి వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరుచుకునే ఉంటాయి.
సరే .. ఇదంతా ఏదో కాసింత తికమకగా గందరగోళం వుంది కదూ. ఇక డైరెక్ట్’గా పాయింట్లోకి వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస) గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బంగారు తెలంగాణ బాటలో దేశాన్ని ‘బంగారు భారత్’ గా అభివృద్ధి చేసే పవిత్ర ఆశయంతో అడుగులు వేస్తున్నారు కదా.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సంకల్పించారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్’ మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సొంత రాష్ట్రం సంగతి తర్వాత చూసుకుందామని, ముందు పక్కరాష్ట్రం ఏపీకి పార్టీ అధ్యక్షుడిని అప్పాయింట్ చేశారు.
అలాగే, ఏపీలో పార్టీలో చేరేందుకు ముందుకొచ్చే వారి కోసం ఒక బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని అంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేటప్పుడు, మంది మర్బాలాన్ని వెంట తీసుకు వెళ్లేందుకు, పెట్రోల్ ఖర్చులతో పాటుగా అనుచరుల విందు వినోదాలకు చేతి చమురు వదిలించుకోవలసి వస్తుంది. కానీ, ఏపీ నుంచి బీఆర్ఎస్’లో చేరేవారి కోసం కేసీఆర్, చుక్క చేతి చమురు అవసరంలేని బంపర్ ఆఫర్ ప్రకటించారని అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరే నాయకులు, ఇంటి గడప దాటి కాలు బయట పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరే వరకు అన్ని సదుపాయాలు బీఆర్ఎస్ చూసుకుంటుంది. అంతే, కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారికి అతిధి మర్యాదలు చేయడంతో పాటుగా బరువైన గిఫ్ట్ పాకెట్స్ కూడా ఐచ్చి పంపుతున్నారని అంటున్నారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుంచి మూడు పార్టీలు మారిన జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రశేఖర్’ను ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించారు.ఈ ముగ్గురు ఏపీ నుంచి హైదరాబాద్’ చేరుకొని, భారాస కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ ముగ్గురు నాయకుల వెంట వారి అనుచరులు భారీగానే ‘లగ్జరీ’ కార్లలో తరలివచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు, స్వాగత తోరాణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఖర్చు పెట్టారు.
నిజానికి ఈ ఘన స్వాగతాలు, అతిధి సత్కార్యాలు చూసిన ఏపీలో ఎటూ కాకుండా ఉన్న రాజకీయ నిరుద్యోగులు, పొలో మంటూ బీఆర్ఎస్’లో చేరేందుకు పరుగులు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోను ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా .. మందు మాకు మర్యాదలు ఉచితంగా వస్తుంటే ఎలా కాదనగలరు.. అయితే విందు వినోదాల కోసం పార్టీలో చేరే వారు, నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా, అంటే అది వేరే విషయం అంటున్నారు పరిశీలకులు.