చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చేసినట్లేనా?
posted on Jan 8, 2023 11:07AM
జగన్ పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా?
బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా? అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. ఈ ప్రచారానికీ, ఊహాగానాలకూ బలం చేకూర్చేలా జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8)న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డుకున్న తీరును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నా.. ఈ భేటీకి అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై ఒక క్లారిటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో పవన్ కల్యాణ్ ను ఆయన విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్ కు సంఘీ భావం తెలిపిన సంగతి విదితమే.
ఇరు పార్టీలూ కూడా జగన్ దుర్మార్గ పాలన అంతం కావాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ పవన్ కల్యాణ్ చాలా కాలం కిందటే రాష్ట్రంలో పొత్తుల చర్చకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ ఏపీలో రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒక దశలో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీని కలుపుకుని ముందుకు సాగాలన్న ఉద్దేశాన్ని చాటిన పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో బీజేపీ కలిసి వచ్చినా లేకున్నా తెలుగుదేశంతో కలిసి సాగాలన్న ఉద్దేశాన్ని చాటుతున్నారు.
జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వచ్చాయి. అయితే జీవో నంబర్ 1 రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. విపక్షాలు రాష్ట్రంలో సభలూ, సమావేశాలూ నిర్వహించడానికే వీల్లేకుండా చేస్తూ జారీ చేసిన జీవోతో ఇక కలిసి అడుగులు వేయాలన్న నిర్ణయానికి జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చేసినట్లు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి ఆయన నివాసానికి వెళ్లడం తేటతెల్లం చేసింది.
ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా జగన్ సర్కార్ దుర్మార్గ విధానాలు, విపక్షాలపై అణచివేత ధోరణిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక ఐక్య కార్యచరణతో ముందుకుసాగాలన్న అభిప్రాయం వీరి భేటీలో వ్యక్తమైందని అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వేర్వేరుగా చేస్తున్న పోరాటాన్ని ఇక ఐక్యంగా కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ భేటీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్1పైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వీరిరువురి భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.