బిఆర్ఎస్ లో అసమ్మతి.. పక్క పార్టీల వైపు చూపులు
posted on Aug 29, 2023 12:42PM
తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ రాజుకుంటుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో కూడా టికెట్లు దొరకని పక్షంలో బిజెపి గూటికి చేరాలని యోచిస్తున్నారు. బీఆర్ ఎస్ పార్టీ టికెట్ కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించిన ఆశావహులు భంగపడ్డారు. కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితాలో 115 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏడు చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. మిగతా వారు సేమ్ టు సేమ్. అంతా పాత ముఖాలే. వీరిపై భూ కబ్జా, అవినీతి ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో తన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేశారు. దళిత బంధు సాంక్షన్ చేయించినందుకు గాను పర్సంటేజిలు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని చెబుతూనే సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించేశారు. హైదరాబాద్ లోని గోషామహల్, నాంపల్లితో బాటు జనగామ, నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై సర్పంచ్ నవ్యతో మిస్ బిహేవియర్ ఆరోపణల నేపథ్యంలో అవకాశం కోల్పోయారు. వీరిరువురు వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేల గెలిచినప్పటికీ ఈ సారి టికెట్ లభించకపోవడం చర్చనీయాంశమైంది.
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేది డిఫరెంట్ స్టోరీ. రెండు పర్యాయాలు ఆమె గెలిచినప్పటికీ మూడో సారి టికెట్ రాలేదు. మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వస్తుందని తనకు టికెట్ ఇవ్వలేదని రేఖానాయక్ అంటోంది.
రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేసిన రేఖారాణికి ఈ సారి ఖానాపూర్ టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ రాకపోతే ఇతర పార్టీల వైపు చూడటం సహజం. కానీ రేఖారాణి పరిస్థితి భిన్నం. తన భర్త మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో రేఖారాణి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. బిఆర్ఎస్ లో అధిష్టానం టికెట్ నిరాకరిస్తే కాంగ్రెస్ లో క్యాడర్ ఆమెకు సహకరించడం లేదు. అక్కడ‘‘రేఖక్కా నువ్వు రాకక్క’’ అనే నినాదం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది. కాంగ్రెస్ లో అప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం రేఖారాణి రాకను వ్యతిరేకిస్తున్నారు.ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ సీటు. బిఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదని రేఖారాణి ఆరోపణ. జాన్సన్ క్రిస్టియన్ అని రేఖారాణి తొలుత నుండి వాదిస్తోంది. ఎన్నికల డిక్లరేషన్ లో జాన్సన్ ఇచ్చే అఫిడవిట్ ను బట్టి లీగల్ కోర్స్ కోసం రేఖారాణి సిద్దంగా ఉంది.
సాధారణంగా ఆయా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఆశావహులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మల్కాజ్ గిరి బీఆర్ ఎస్ అభ్యర్థిగా మైనంపల్లి అని కేసీఆర్ ప్రకటించారు. 115 అభ్యర్థుల్లో మైనంపల్లి ఒకరు. ఆయనకు పోటీగా మరో అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీలో లేరు. అయినా మైనంపల్లిపై వేటు వేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం చేసింది. మళ్లీ బిఆర్ఎస్ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.అభ్యర్థుల పేర్లను ప్రకటించే రోజే తిరుమలలో మైనంపల్లి మంత్రి హరీష్ రావ్ ను నీ అంతు చూస్తా అని బెదిరించడాన్ని పార్టీ సీరియస్ గానే తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఎంఎల్ సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. మైనంపల్లి వ్యాఖ్యలను తప్పు పట్టారు. వాళ్లు హరీష్ రావ్ కు మద్దతుగా నిలిచారు.
అమెరికా నుండి ఇండియాకు వచ్చిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి రాజకీయాలు ప్రారంభించి రామాయంపేట ఉప ఎన్నికలో టీడీపీ నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభా ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మైనంపల్లి మల్కాజ్ గిరి టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డారు. అదే సంవత్సరం టీడీపీ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయి అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి లోకసభ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హన్మంత్ రావ్ టీఆర్ఎస్ లోతిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ ఎంఎల్ సిగా ఎన్నికైన ఏడాదిలోపు జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాంచందర్ రావ్ పై మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ లో అప్రతిహాతంగా కొనసాగుతున్న మైనంపల్లి పుత్రవాత్సల్యంతో ఈ సారి మెదక్ టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి వెళ్లడంతో మైనంపల్లి తట్టుకోలేకపోయారు. సిట్టింగ్ అయిన తనకు మల్కాజ్ గిరి టికెట్ రావడంలో సంతోషం కన్నా కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి ఎక్కువ డిసపాయింట్ అయ్యారు. పార్టీ మారే ఆలోచనలో మైనంపల్లి ఉన్నారు. ఎమ్మెల్యేగా తన మీద ఆశలు పెట్టుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని మైనంపల్లి రూట్ మార్చారు. వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాన్ని తీసుకుంటానని మైనంపల్లి చెబుతున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అని మైనంపల్లి ముందున్న సవాల్ అయితే మైనంపల్లి కాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది బిఆర్ఎస్ ముందున్న సవాల్. తనతో బాటు కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని మైనం పాటి తెగేసి చెప్పారు.
కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వర రావ్ కు ఈసారి చుక్కెదురైంది. గత ఎన్నికలలో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల కు పాలేరు టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ పక్కకు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆహ్వానం మేరకు ఖమ్మం జిల్లా కు చెందిన ఈ నేత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 లో బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి మంత్రయ్యారు. ఈ సారి టికెట్ కూడా లభించలేదు. ఇటీవల తుమ్మల ఖమ్మంజిల్లాలో బలప్రదర్శన నిర్వహించారు. గులాబీ జెండా లేకుండానే తుమ్మల రోడ్ షో చేపట్టారు. తాను ప్రజా క్షేత్రంలో ఉంటానని ప్రకటించి బిఆర్ఎస్ కు దూరమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ మొదటి జాబితా రానుంది. కాంగ్రెస్ లో టికెట్ రాని వారు ఇతర పార్టీల్లో చేరే అవకాశాలున్నాయి. జంప్ జిలానీలకు చక్కటి అవకాశం లభించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.