అర్జున అవార్డు గ్రహీత కుల్ఫీలు అమ్ముతున్నాడు

 

బరిలో తన చేతులతో ప్రత్యర్థిని కట్టడి చేసిన వీరుడు,దేశానికీ ఎన్నో పథకాలు సాధించి పెట్టిన ధీరుడు..ప్రస్తుతం కుల్ఫీలు అమ్ముకునే పరిస్థితి.హరియాణాకు చెందిన దినేష్‌ బాక్సర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు. మొత్తం 17 స్వర్ణ, 1 రజత, 5 కాంస్య పతకాలు నెగ్గాడు. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులమీదుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. 2010 ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. కానీ, దేశం తరఫున పతకాలు కొల్లగొడుతూ ఓ వెలుగు వెలగాల్సిన అతడి జీవితాన్ని రోడ్డు ప్రమాదం తలకిందులు చేసింది.

 

 

2014 కామన్వెల్త్‌ క్రీడలకు ముందు ట్రైనింగ్‌ క్యాంపుకు వెళ్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో దినేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో అతడి కుడి చేతి ఎముక రెండుచోట్ల విరగడంతో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో బాక్సింగ్‌కు దూరమయ్యాడు. కొడుకు కోసం అప్పు చేసి మరీ వైద్యం చేయించాడు దినేష్ తండ్రి. అప్పటికే కొడుకు విదేశాల్లో ఆడేందుకు వెళ్ళటానికి చేసిన అప్పుకుతోడు వైద్యానికి చేసిన అప్పులు కూడా తోడవ్వడంతో వడ్డీలు అంతకంతకూ పెరిగిపోతూ వచ్చాయి. తండ్రి తనకోసం చేసిన అప్పులు తీర్చడానికి దినేష్‌ కూడా ఆయనతోపాటు కుల్ఫీలు అమ్మడానికి రోడ్లపైకి వచ్చాడు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందకపోవడంతో కుల్ఫీలు అమ్మాల్సి వస్తోందని దినేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నన్ను అంతర్జాతీయ టోర్నీలకు పంపడానికి నా తండ్రి అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం సహాయం చేయాల’ని దినేష్‌ విజ్ఞప్తి చేశాడు. తనకు ఉద్యోగమిచ్చి తన జీవితానికి భరోసా కల్పించాలని,భవిష్యత్‌ ఆటగాళ్లను తయారు చేయగల అనుభవం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.