బోరుగడ్డ సమాజానికి ప్రమాదం!
posted on Mar 25, 2025 5:01PM
.webp)
బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లారు.
అక్కడ తన తల్లి ఆరోగ్యం బాలేదనీ డాక్టర్ సర్టిఫికేట్ చూపుతూ బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక్కడ వరకూ అంతా ఓకే కానీ, తల్లికి ఆరోగ్యం బాలేదంటూ అందుకు రుజువుగా బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ నకిలీదని తేలడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. బెయిల్ గడువు ముగిసిపోయింది. అదే సమయంలో తనకు తనకు బెయిల్ పొడిగించాలని మరోసారి బోరుగడ్డ కోర్టును ఆశ్రయించారు.
ఈ రెండు పిటిషన్లనూ విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.. బెయిలు పొడగింపును నిరాకరించడమే కాకుండా, ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి జైలు అధికారులకు లొగిపోవాలని ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు కూడా. అయితే బోరుగడ్డపై పోలీసులు నమోదు చేసిన నకిలీ డాక్టర్ సర్టిఫెకెట్ కేసు, హైకోర్టును తప్పుదోవ పట్టించారన్న కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా వీటిపై విచారణ జరిపిన కోర్టు.. బోరుగడ్డ వంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని.. ఇటువంటి వారిని ప్రత్యేకంగా చూడాలని వ్యాఖ్యానించింది.