ఏ దేశమేగినా దీదీ .. దీదీనే !

ఏ దేశ  మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు,  పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది. ఇక ఆడ వారి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కానీ, మమతా దీదీ  అలాక్కాదు. ఇక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఆమె వేషం మారదు.  

అవును. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు,  మమతా దీదీ ప్రస్తుతం లండన్‌  పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసమే వెళ్ళారో, ఇంకెందు కోసం వెళ్ళారో ఏమో కానీ, పొద్దున్నే లేచి, ఆమె బస చేసిన హోటల్  కు దగ్గరలో ఉన్న హైడ్ పార్క్ లో వాకింగ్ కు వెళ్ళారు. అయినా.. ఆమె వేషం మారలేదు. అదే చీర, అవే చెప్పులు. ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. అయితే  ఆ  బృందంలోని  ఆడ, మగ సెక్యూరిటీ అధికారులు అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా.. కోట్లు .. బూట్లు వేసుకుని నడిస్తే.. మమతా దీదీ మాత్రం మాములుగా చీరకట్టులో, స్వెటర్ మాత్రం వేసుకుని, కాళ్ళకు ఎప్పటిలానే స్లిప్పర్స్  మాత్రమే వేసుకుని కోల్ కతా వీధుల్లో నడిచిననట్లే చక చకా నడుస్తూ వాకింగ్ తో పాటు జాగింగ్ చేశారు. ఆమె వెంట ఇంగ్లాండ్ వెళ్ళిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ మమతా దీదీ నడక వీడియోను తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడే కాదుట, గతంలోనూ ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా  వేషం ఎప్పుడు మార్చ లేదుట. 

అయితే  ఇలా ఏ దేశం వెళ్ళినా, మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేత వచ్చినా, ఎక్కడ ఎవరితో ఉన్నా మున్నూట అరవై రోజులు వేషం మార్చని మరో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ఎస్, మన ఆంధ్ర ప్రదేశ్ సిఎం  నారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా  అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించారు.  బిల్ క్లింటన్ వంటి అనేక మంది దేశాధి నేతలతో దెశ విదేశాల్లో వేదికలు పంచుకున్నారు. అయినా, ఎప్పుడూ ఆయన వేషం మార లేదు. నిజానికి, చంద్ర బాబును మరో రూపంలో మరో వేషంలో ఉహించుకుందామన్నా నో ఛాన్స్. అవును, చంద్రబాబు మాములుగా అందరిలానే  ప్యాంటు,షర్టు ధరిస్తారు. షూస్ వేసుకుంటారు. కానీ, ప్యాంటు, షర్టు కలర్ మారదు. చిత్రం ఏమంటే కొలతలు కూడా  మారవు. అవును, 70 ప్లస్ లోనూ ఆయన శరీర కొలతల్లో పెద్దగా మార్పు కనిపించదు. బహుశా ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం, జీవన శైలి, ఇందుకు కారణం కావచ్చును.

ఇదే కోవకు చెందిన మరో ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఈయన కట్టేది కాషాయం. అవును, ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రస్ నాయకులు ఖద్దరు ఒక్కటే కట్టే వారు. ఇప్పడు టీ షర్టులు, జీన్స్ పాంట్స్ తో పార్లమెంట్’కు వస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి.  చివరగా, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన  జాతి పిత మహాత్మా గాంధీ చివరి వరకు  కొల్లాయి మాత్రమే కట్టారు. అవును కొల్లాయి కడితేనేమి మా గాంధీ’ అనిపించుకున్నారు. ప్రాతః స్మరణీయులయ్యారు.