బోరుగడ్డని అరెస్టు చేయడానికి చేతులెలా వచ్చాయ్?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు చాలా దారుణమైన పని చేశారు. వైసీపీ నాయకుడు, శాంతికాముకుడు, మృదుభాషి, సంస్కారవంతుడు, సభ్యతకు మారుపేరు, నీతి నిజాయితీలకు నిలువుటద్దం, మంచివాడు, సౌమ్యుడు, విద్యావేత్త, అన్నిటికంటే ముఖ్యంగా దళితుడు అయిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ని బుధవారం నాడు గుంటూరులోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో వుండగా జగన్‌ కోసం తన పన్నీటి కొలను లాంటి, హంసలు విహరించే మానస సరోవరం లాంటి, అమృతం బోరులాంటి  తన చక్కటి నోటితో బోరుగడ్డ అనిల్ ఎన్నెన్నోమృదుమధుర భాషణలు చేశాడు. కానీ దారుణం... ఏ పాపమూ ఎరుగని శాంతిదూత అయిన బోరుగడ్డ అనిల్‌ ఇప్పుడు పోలీసుల అదుపులో వున్నాడు. అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, బోరుగడ్డ అనిల్ దళితుడు కాబట్టే అరెస్టు చేశారు. ఆయన దళితుడు కాకుండా వుంటే అందరూ నెత్తిన పెట్టుకుని ఊరేగేవారు. కేవలం దళితుడు అయినందువల్లే తన భర్తని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారని ఆయన భార్య గద్గద స్వరంతో బాధపడుతూ వుంటే వింటున్నవాళ్ళకి గుండెలు కరిగిపోయి కళ్ళలోనుంచి బయటకి వస్తున్నాయి. నా భర్త ఏం చేశాడని పోలీసులు అరెస్టు చేశారని ఆ మహా ఇల్లాలు ఆవేశంగా ప్రశ్నించడం చూస్తుంటే ఎంత బాధ కలుగుతోందో చెప్పలేని పరిస్థితి. నిజమే... బోరుగడ్డ అనిల్ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు.  తాను తన భర్తని ఇంట్లో పెట్టి తాళాలు వేసి ఆస్పత్రికి వెళ్ళానని, ఈలోపే పోలీసులు వచ్చేసి తాళాలు పగులగొట్టి, ఇంట్లో వున్న తన భర్తని అరెస్టు చేశారని ఆమె ఆక్రోశిస్తూ చెబుతుంటే ఎంత దారుణమో కదా అనిపిస్తోంది. బోరుగడ్డ అనిల్ లోపల వున్నట్టు పోలీసులకు తెలిస్తే, ఆస్పత్రికి వెళ్ళిన ఆయన భార్య వచ్చేవరకూ పోలీసులు ఇంటి ముందు పడిగాపులు కాయాలిగానీ, తాళాలు పగులగొట్టి మరీ అరెస్టు చేయడమేంటి? పగిలిపోయిన తాళాల రిపేరు ఖర్చులు పోలీసులు ఇస్తారా? ఒకవేళ తాళాలు రిపేరు కానంతగా డ్యామేజ్ అయిపోతే కొత్త తాళాలు ఈ పోలీసులు కొనిస్తారా? పైగా వాళ్ళ పిల్లలు కూడా లోపల వున్నారట. పిల్లల ముందే తండ్రిని అరెస్టు చేశారని ఆ మాతృమూర్తి బాధపడుతోంది. పిల్లలముందు తండ్రిని అరెస్టు చేయకూడదనే కనీస మానవత్వాన్ని మరచిపోయిన పోలీసులు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? తన భర్త తనకు కనిపించకుండా పోయి రెండు గంటలు అయిందని ఆ మహా ఇల్లాలు తల్లడిల్లిపోతుంటే చూడలేని పరిస్థితి. అయినా, పాపం... లోపల రెస్టు తీసుకుంటున్న బోరుగడ్డ అనిల్‌ని అరెస్టు చేయడమేంటి? రెస్టు తీసుకోవడమే నేరమా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ఇంటిపట్టున లేకుండా ఆ ఊరికీ, ఈ ఊరికీ తిరిగీ తిరిగీ అలసిపోయాడు బిడ్డ. ఆ అలసట తీర్చుకోవడం కోసం ఇంటికి వచ్చి రెస్టు తీసుకుంటుంటే పోలీసులు అరెస్టు చేశారు. రెస్టు తీసుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అని ఈ పోలీసులకు తెలియదా? రెస్ట్ ఈజ్ రెస్ట్.. రెస్ట్ ఫర్ రెస్ట్.. రెస్ట్ మీన్స్ రెస్ట్ అని ఈ పోలీసులకు తెలియదా?

కరెక్టే, వైసీపీ అధికారంలో వుండగా బోరుగడ్డ అనిల్ అప్పట్లో ప్రతిపక్షంలో వున్న వాళ్ళని అందర్నీ నోటికొచ్చిన బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని చంపుతానని అన్నాడు. ఆమాత్రం దానికే అరెస్ట్ చేస్తారా? చంపుతానని అన్నాడే తప్ప చంపాడా? చంపలేదు కదా? అలాంటప్పుడు అరెస్టెందుకు చేశారు? బోరుగడ్డ అనిల్ చంపుతానని అన్నందుకే అంత ఫీలైపోవాల్సిన అవసరమేంటి? ఏదో మాటవరకి చంపుతా అని వుంటాడు. అలాంటి మాటల్ని లైట్‌గా తీసుకోవాలనిగానీ, ఇలా అరెస్టు చేయడమేంటి? వైసీపీ అధికారంలో వున్న సమయంలో బోరుగడ్డ అనిల్ అలా మాట్లాడాడే తప్ప, అధికారం పోయిన తర్వాత ఒక్క మాట అయినా అన్నాడా? లేదే!? అలాంటిప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? ఇది పాత  కక్షలను మనసులో పెట్టుకుని చేసిన అరెస్టు అని క్లియర్‌గా తెలిసిపోతోంది కదా? అయినా అప్పట్లో బోరుగడ్డ అనిల్ ఆ రేంజ్‌లో మాట్లాడ్డం వల్లే కదా జనం వైసీపీ గవర్నమెంట్‌ని దించేసి చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. కనీసం ఈ కృతజ్ఞత కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ప్రభుత్వానికి కృతజ్ఞత అనేదే వుంటే బోరుగడ్డ అనిల్‌కి ఎమ్మెల్సీ ఇచ్చి, హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టాలి. అలాంటిది పోలీసులతో అరెస్టు చేయిస్తారా? సమాజంలో  మానవత్వం చనిపోయింది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ వుంటుందా?  అసలు ఆ మానవతా మూర్తిని అరెస్టు చేయడానికి చేతులెలా వచ్చాయంట? చివరిగా చెప్పేది ఒకటే... బోరుగడ్డ అనిల్‌ని వెంటనే విడుదల చేయాలి. పగలగొట్టిన తాళాలకు బదులు కొత్త తాళాలు కొనివ్వాలి!