తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్.. ఆయన నివాసం వద్ద బాంబులు పెట్టామ

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదరింపు కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆయన నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ ఓ అజ్ణాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తో పోలీసులకు చెమట్లు పట్టాయి. బాంబు స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు చివరికి అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్ చేసిందెవరన్నదానిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. అతడి పేరు తామరైకన్నన్ అనీ, తురునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన వ్యక్తనీ గుర్తించారు. గంజాయి మత్తులో అతడు బెదరింపు కాల్ చేశాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్ రావడంతో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా విపక్షాలను కలుపుకుంటూ సుపరిపాలన అందించే దిశగా కదులుతున్న స్టాలిన్ ప్రాణాలకు ముప్పు ఉందని చాలా కాలంగా ఆందోళన వ్యక్తమౌతున్నది.

ఈ నేపథ్యంలోనే స్టాలిన్  నివాసంలో బాంబులు పెట్టామనీ, ఆయనను చంపేస్తామనీ వచ్చిన కాల్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా ఆందోళనకూ కారణమైంది. చివరకు అది ఫేక్ కాల్ గా నిర్ధారణ అయినప్పటికీ స్టాలిన్ భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పరిశీలకులు అంటున్నారు.