కరోనా ముప్పు ఇంకా పొంచే ఉంది.. హైదరాబాద్ లో కొత్త వేరియంట్ తొలి కేసు

కరోనా ముప్పు ఇంకా పొంచే ఉంది. మూడు వేవ్ లలో లక్షల మంది ప్రాణాలను హరించేసిన ఈ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో మానవాళిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి సారిగా   ఒమిక్రాన్ వేరియంట్ బీఏ 4 కేసు  తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో నమోదు అయ్యింది. దీంతో కరోనా ప్రొటోకాల్ పాటించాల్సిన అనివార్యత మరోసారి తెరమీదకు వచ్చింది.   ఈ వేరియంట్ ప్రాణాలకు హరించే  ప్రమాదకారి కాకపోయినా ఇది మరిన్ని నగరాలకు వ్యాపించే అవకాశం మాత్రం ఉందని  వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిలో  ఒమిక్రాన్ బీఏ4 వేరియంట్ను  ఈ నెల 9న వైద్యాధికారులు గుర్తించారు.  దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసుల ఉధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ4 భారతదేశంలో  వెలుగుచూడడం అందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ బీఏ4 వేరియంట్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ వెల్లడించారు.  దీని వ్యాప్తి వేగం, తీవ్రత అధికంగా  ఉంటుందని వారు హెచ్చరించారు. అయితే.. ఒమిక్రాన్ ఇప్పటికే భారత్ లో వ్యాపించడం, విస్తృతంగా వ్యాక్సినేషన్ జరగడంతో బీఏ4 ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి హైదరాబాద్ వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిపిన వైద్య పరీక్షల్లో ఒమిక్రాన్ బీఏ4 వేరియంట్ సోకినట్లు గుర్తించారు.  అయితే.. ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలేవీ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. అమెరికా, దక్షిణాఫ్రికాలో కరోనా ఐదో వేవ్ ఉధృతికి కారణమైన రెండు వేరియంట్లలో ఒమిక్రాన్ బీఏ4 కూడా ఒకటి. దక్షిణాఫ్రికాలో జనవరి నుంచి ఒమిక్రాన్ బీఏ4, బీఏ5 వేరియంట్లు విజృంభించాయి. అనంతరం ఈ వేరియంట్లు అమెరికా, ఐరోపా దేశాలకు కూడా విస్తరించాయి.