బీజేపీలో టీ-ఏపీ చీలిక?

 

 

 

తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూనే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఏం చేస్తారో, ఎన్ని నిధులిస్తారో స్పష్టం చేయాలని రాజ్యసభలో పట్టుబట్టిన నాయకుడు వెంకయ్య నాయుడు. తన వాగ్ధాటితో, ప్రాసలతో కూడిన ప్రసంగాలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే వెంకయ్యకు.. ఇప్పుడు తెలంగాణా ప్రాంత బీజేపీ నాయకులు దూరం అవుతున్నారు. ఈ విషయం స్పష్టంగా బయటకు కనపడుతోంది. ఆయన ఎప్పుడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం పెట్టినా ఇరువైపులా తెలంగాణ ప్రాంత నాయకులు బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె. లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు లాంటి నేతలు ఎవరో ఒకరు ఆయన పక్కన కూర్చునేవారు. గురువారం ఈ ప్రాంత నేతలెవరూ లేకుండా వెంకయ్య విలేకరుల సమావేశం జరిగింది.

 
ఆంధ్ర ప్రాంత నేతలు యడ్లపాటి రఘునాథ్‌బాబు, విష్ణువర్ధన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి తదితరులు వెంకయ్యతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధీష్ రాంబొట్ల ఈ సమావేశంలో పాల్గొన్నా,  వెంకయ్య ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు సంబంధిం చిన నేతగా పరిచయం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణా అభినందన సభకు సైతం వెంకయ్యనాయుడు దూరంగానే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే, ఎప్పుడో కాకినాడ సభ నుంచే ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు అంటూ నినాదాలిచ్చిన బీజేపీలో ఇప్పుడు ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.