కేసీఆర్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి? బీజేపీ నేత సంచలనం..

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నేతల వలసలు ఊపందుకుంటున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.  దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత దూకుడు పెంచిన బీజేపీ.. అదే స్పీడును కొనసాగిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతున్నారు. విపక్షాల దూకుడుతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహం మార్చింది. గులాబీ లీడర్లు జోరుగా జనంలోకి వెళుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

టీఆర్ఎస్ తో పాటు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని సన్నాసి అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలను రేవంత్ రెడ్డి తిడుతున్నా.. కమలం నేతల నుంచి మాత్రం కౌంటర్లు రాలేదు. రేవంత్ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు ఎంపీలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రేవంత్ రెడ్డి 20 రోజుల క్రితం ధర్నా చేస్తానంటే ఇందిరా పార్క్ వద్ద అనుమతి ఇచ్చిన సీఎం.. బీజేపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నడుపుతున్నదెవరు? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ను నడుపుతున్నది కేసీఆరే అన్నారు అర్వింద్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నడు.. రేపు కాంగ్రెస్ టిక్కెట్లు కూడా కేసీఆరే ఇస్తడు అంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఫార్టీ గాంధీ భవన్ నుండి నడవడం లేదు.. ప్రగతి భవన్ నుండి కేసీఆర్ నడిపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన పనులకు దిగజారుతున్నారని... చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బతుకు ఎందుకో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఒక ఉపఎన్నికలో గెలవడానికి బలుపెక్కి, బరితెగించి, నీచాలకు దిగజారారని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న పనులకు ఆయనను ప్రజలు చీదరించుకుంటున్నారని... అయినా ముఖ్యమంత్రికి సిగ్గు రావడం లేదని అన్నారు. హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేసుల మీద కేసులు పెడుతున్నారని సంజయ్ అన్నారు. బీజేపీ జెండా కనిపిస్తే వణికిపోతున్నారని చెప్పారు. బీజేపీకి అనుకూలంగా రోజురోజుకూ సర్వే రిపోర్టులు పెరిగిపోతున్నాయని, దీంతో కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. 
 
ఇంతకాలం రేవంత్ రెడ్డి తమపై ఆరోపణలు చేస్తున్నా స్పందించని తెలంగాణ కమలనాధులు.. సడెన్ గా వాయిస్ పెంచడం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలన్న హైకమాండ్ డైరెక్షన్ లోనే భాగంగానే అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది.