అయోధ్య,వారణాసిలో బీజేపీ ఓటమి! యూపీలో యోగీకి షాక్ 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఇటీవలే కర్ణాటకలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉండికూడా చతికిలపడింది. తాజాగా ఏడాదిలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ  సత్తా చాటుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన జిల్లా, క్షేత్ర(మండల), గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయి. 

ప్రధాని నరేంద్ర మోడీప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసితోపాటు బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకుగానూ ఎస్పీ 15 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు. మధురలోని మొత్తం 33 సీట్లలో ఎనిమిది మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ 13 స్థానాల్లో విజయం సాధించగా, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరక్ పూర్ లో (మొత్తం స్థానాలు 68) బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ చెరో 22 గెలుచుకోగా, 23 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నిషాద్ పార్టీలు తలా ఒక సీటును గెలుచుకున్నాయి. 

మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీఎస్పీ బలపర్చిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇండిపెండెట్లు 608 మంది లీడింగ్ లో ఉన్నారు. యూపీలో మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర(మండల) పంచాయితీల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌పై గొడవ జరిగడంతో వ్యవహారం సుప్రీం దాకా వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో  కౌంటింగ్‌ మొదలైంది. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. 

ఎమ్మెల్యేల స్థానాలను తలిపించే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను కీలకంగా భావించే బీజేపీ అక్కడి స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడం హెచ్చరిక లాంటిదేనని పార్టీనేతలు అంగీకరించారు. యూపీ పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలకు ఇంకా సమయం పడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu