ఏపీలో మద్య దర్శనం.. తెల్లవారుజామునే ఛీర్స్
posted on May 5, 2021 9:20AM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్పెషల్. రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది. ఏపీ ప్రజలకు మద్య దర్శనం కల్పించింది. ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి వచ్చింది. . గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారి ఉదయం 6గంటలకే లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి.
కరోనా పంజా విసురుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాణిజ్య కార్యకాలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. అందులో భాగంగానే సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం షాపులను ఉదయమే తెరవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు తెరవాలని ఆదేశించింది. దీంతో బుధవారం తెల్లవారుజామునే ఏపీలో మద్యం దుకాణాలన్ని తెరుచుకున్నాయి. మందు బాబులు లిక్కర్ కోసం క్యూలు కట్టారు. మద్యం షాపులతో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటిస్తున్నాయి.

గతేడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 43 రోజుల పాటు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమ్మకాలకే మొగ్గు చూపింది. ఇదంతా ఆదాయం కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ఫ్యూ అమలుచేస్తే ఒకచోట నలుగురు కంటే గుమికూడకూడదు. అలాంటప్పుడు బార్లకు అనుమతి ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు ఎప్పటిలాగే మద్యం షాపుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అలా క్యూలు ఉంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది.