న్యాయమా రెడ్డీ? రాజకీయం 'కమ్మ'గుంది!
posted on May 5, 2021 8:55AM
జగన్‌ది రెడ్డి సైన్యం. చంద్రబాబుకు కమ్మ ధైర్యం. ఇలా ఏపీలో రెండు బలమైన సామాజిక వర్గాలు.. ఇద్దరు నాయకులను వెనకుండి నడిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే.. వారిదే అధికారం. ఏళ్లుగా ఇదే జరుగుతోంది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక తర్వాత ఏపీలో టీడీపీ మళ్లీ బలం పుంజుకుంటోందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఓడినా టీడీపీ బలంగా ప్రతిఘటించింది. తెలుగు తమ్ముళ్లు కసితో పని చేశారు. కలిసికట్టుగా పోరాడారు. ప్రతిపక్ష పార్టీని 3 లక్షల మెజారిటీలోపే నిలువరించారు. ప్రస్తుతం చంద్రబాబు సామాజిక వర్గం ఏపీలో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే.. జగన్‌రెడ్డి వర్గం మాత్రం తీవ్ర నిరుత్సాహం, నిర్లిప్తతతో ఉంది. ఈ తీరే.. భవిష్యత్తులో అధికారాన్ని మళ్లీ తారుమారు చేసే అవకాశం ఉందంటున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు.
ముందు రెడ్ల విషయానికి వద్దాం. రాయలసీమ వ్యాప్తంగా రెడ్డి వర్గానిదే ఆధిపత్యం. మిగతా జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రభావం. వీళ్లే జగన్మోహన్‌రెడ్డికి అండా-దండా. అంగ బలం, అర్థ బలంతో జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల నాటికి ఐదేళ్లుగా అధికారానికి దూరమై.. ఆవురావురమంటూ ఉన్న ఆ సామాజిక వర్గం.. ఆనాటి ఎలక్షన్లలో జగన్‌రెడ్డి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశారు. మళ్లీ పవర్‌లోకి రావాలనే ధృడ సంకల్పంతో గట్టిగా ప్రయత్నించారు. తమ ఆర్థిక వనరులన్నీ పోగేసి.. ఎన్నికల్లో భారీగా ఫండింగ్ చేసి.. స్వచ్ఛందంగా పని చేసి.. జగన్‌రెడ్డిని గెలిపించుకున్నారు. తమ వాడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం చూసి తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు పదింతలు తిరిగి రాబట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ, ఆదిలోనే వారి ఆశలు అడియాశలు అయ్యాయి. అక్కడున్నది జగన్‌రెడ్డి కదా. వీళ్ల దోపిడీ సాగలేదు. దొరికినదంతా తిమింగళంలా ఆయనే దోచుకుంటున్నారంటూ.. పిల్ల చేపలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. మనోడే అనుకుంటే నట్టేట ముంచేస్తున్నాడుగా అంటూ తెగ వర్రీ అవుతున్నాయి.
ఏపీలో లిక్కర్, ఇసుక రీచ్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రధానంగా రెడ్ల చేతిలో ఉంటాయి. ఆ మూడింటిలో ఇప్పుడు రెడ్లకు అవకాశం లేకుండా చేశాడు జగన్‌రెడ్డి. కాసులు పిండుకునే ఛాన్స్ ఉండే.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేసి లిక్కర్ డాన్‌ల గల్లాపెట్టె పగలగొట్టాడు. చంద్రబాబు హయాంలోనూ వైన్లు, బార్లతో బాగా సంపాదించుకున్న ఆ వర్గమంతా.. ఇప్పుడు నోరు మూసుకొని చూస్తూ ఉండాల్సిన దుస్థితి. భారీగా ముడుపులు స్వీకరించి.. ఊరూపేరు లేని బ్రాండ్లను తీసుకొచ్చి, అడ్డగోలుగా ధరలు పెంచి.. లిక్కర్ ఆదాయాన్నంతా జగన్‌రెడ్డి ఒక్కడే గంప గుత్తగా దోచేసుకుంటున్నాడనే ఆగ్రహం ఆ వర్గంలో వెల్లువెత్తుతోంది. అధికారంలో ఉన్న జగన్‌ను ఏమీ చేయలేక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఒకప్పటి మద్యం వ్యాపారులంతా.
అటు, రెడ్డి వర్గాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇసుక తవ్వకాలనూ ఏక మొత్తంగా రద్దు చేసేశారు జగన్‌రెడ్డి. కొత్త ఇసుక పాలసీ అంటూ.. రాష్ట్రంలోని శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్ మొత్తాన్ని వేలం వేసి అంగట్లో అమ్ముకున్నారు. తనకు అత్యంత సన్నిహితమైన రాంకీ గ్రూపునకే ఏపీలోని ఇసుకంతా దారదత్తం చేశారు. పరోక్షంగా జగన్ ఒక్కడే ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
ఇక ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ రంగం అధఃపాతాలానికి పడిపోయింది. అమరావతిని మూడు ముక్కలు చేయడంతో భూముల ధరలు కుప్పకూలిపోయాయి. కనీసం ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన విశాఖలోనైనా రియల్ వ్యాపారం చేసుకుందామన్నా అదీ కుదరడం లేదు. విశాఖలో భూమంతా వైసీపీ నేతల పరమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఆగడాలతో భూమిపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు భయపడుతున్నారని అంటున్నారు. చంద్రబాబు హయాంలో ప్రతీ జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్టు గానీ, సెజ్ గానీ ఉండేది. దీంతో, ఏపీ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది. ఆ రంగంలో ముందున్న రెడ్లు అప్పట్లో బాగా లాభపడ్డారు. ఇప్పుడు జగన్ రాకతో.. అంతా తలకిందులైంది. రియల్ రంగం కుదేలైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తెలంగాణలో రెండు ఎకరాల భూమి అమ్మితే.. ఏపీలో 3 ఎకరాలు కొనుక్కోవచ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతున్నాయి.
అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో ఉండటంతో.. అన్ని రకాల వ్యాపారాలు చేసే రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా బాగా చితికిపోయింది. మనోడని గెలిపిస్తే.. మనల్నే ముంచేస్తున్నాడని ఆ వర్గమంతా అక్కస్సుతో ఉందని చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కమ్మ వర్గానికి వ్యాపారాల్లో ప్రాధాన్యత లభించిందనే టాక్ ఉంది. ఆ సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు బాగా సంపాదించుకున్నారని చెబుతారు. దీంతో.. సంపాదించింది చాల్లే అన్న సంతృప్తి.. మనమే ఎలాగూ గెలుస్తామనే ఉదాసీనత.. రెండూ కలిసి 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు వర్గంలో నిర్లిప్తత ఆవహించింది. అందుకే, ఆ ఎలక్షన్లలో ఉదాసీనంగా వ్యవహరించారు. అదే సమయంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న రెడ్లు కసితో కష్టపడ్డారు. ఫలితం.. 2019లో అధికారం కమ్మ నుంచి రెడ్డి చేతికి చిక్కింది.
రెండేళ్లైనా గడిచిందో లేదో.. మళ్లీ మార్పు మొదలైందని అంటున్నారు. జగన్‌రెడ్డిని అందలమెక్కించినా దమ్మిడి ఆదాయం లేక, పెద్దగా ప్రయోజనం లేక.. ఆయన సామాజిక వర్గమంతా ఆగ్రహంతో ఉందంటున్నారు. అదే సమయంలో.. అధికారం లేకపోతే తమ పరిస్థితి ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో కమ్మ వ్యాపారులకు, తెలుగు తమ్ముళ్లకూ బాగా తెలిసొచ్చింది. అందుకే, టీడీపీ శ్రేణులంతా మళ్లీ ఏకమై చంద్రబాబు గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలి ప్రభావం, ఫలితం తిరుపతి ఉప ఎన్నికలో కనిపించింది. ప్రచారంలో టీడీపీ వర్గాలు చమటోడ్చాయి. తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే తాపత్రయం, పట్టుదల వారిని కష్టపడేలా చేసింది. అందుకే,, తిరుపతిలో చంద్రబాబు, నారా లోకేశ్ ర్యాలీలు, సభలో జనంతో కిక్కిరిసిపోయాయి. బైపోల్‌లో టీడీపీకి జేజేలు హోరెత్తాయి. వైసీపీ మెజార్టీకి భారీగా కోత పడింది. ఇదే పట్టుదలతో, ఇదే కసితో.. ముందుముందు మరింత గట్టిగా ప్రయత్నిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మళ్లీ టీడీపీనే వరించడం ఖాయం. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఎనీ డౌట్స్?