రోజాకు కేబినెట్ బెర్త్ వెనుక ఇంత కథ నడిచిందా?!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టిన తర్వాత  రోజా జెట్  స్పీడ్ లో దూసుకుపోతున్నారు.ప మంత్రి పదవి చేపట్టగానే.. విశాఖ శారదాపీఠాధిపతి స్వామి సర్వూపనందేంద్ర స్వామి ని దర్శించుకున్నారు.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు  విజయమ్మను   హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో కలిసి.. ఆశీర్వాదం తీసుకున్నారు.  అయితే పార్టీ వర్గాల కథనం మాత్రం రోజాకు కేబినెట్ బెర్త్ అంత సులువుగా దక్కలేదు. చివరి నిముషం వరకూ ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా అన్న సస్పెన్స్ మెయిన్ టైన్ అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

రానున్నది ఎన్నికలు సీజన్. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పు అన్ని సామాజిక వర్గాలకు సమానంగా.. అలాగే అన్ని జిల్లాలకు సమతూకం పాటించేలా  ఉండాలని జగన్ భావాంచారు. అలాగే కనుక జరిగితే రోజాకు కేబినెట్ లో స్థానం లభించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రోజా   కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కొద్ది రోజుల ముందే  తాడేపల్లి ప్యాలెస్‌లోని కీలక నేతలతో వరుసగా బేటీలతో తనకు క్యాబినెట్ లో స్థానం కల్పించాలని కోరుతూ, పార్టీ కోసం తాను చేసిన సేవలను, విపక్ష తెలుగుదేశం నుంచి ఎదుర్కొన్న అవమానాలనూ ఏకరవు పెట్టారని చెబుతున్నారు.  తనకు కేబినెట్ లో స్థానం కల్పించాల్సిందేనంటూ భీష్మించుకు కూర్చున్నట్లు చెబుతారు. తనకు మంత్రి పదవి రాకుంటే..  ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని  పార్టీ అగ్రనేతలను ఆర్కే రోజా ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ చేశారని అంటున్నారు. సొంత పార్టీలోనే తనకు విపక్షం తయారై తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయాన్నీ ఆమె ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలకు ఏకరవు పెట్టినట్లు చెబుతున్నారు.తన సొంత జిల్లా చిత్తూరులో సీనియర్ నేత పెద్దిరెడ్డి అండ్ కో వల్ల తన వర్గం పడిన..  పడుతోన్న ఇబ్బందులను సైతం పార్టీ అధినేత జగన్‌కు ఆర్కే రోజా ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు వివరించారట.    

మంత్రి పదవి ఇవ్వకుంటే తనకు తీవ్ర అవమానం జరిగినట్లేనంటూ   కన్నీటి పర్యంతం కావడంతో    జగన్.. ఆమెకు కేబినెట్‌లో చోటు కల్పించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రోజాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డితో   జగన్ చర్చించి, ఆ తరువాతే మంత్రిగా ఆర్కే కు అవకాశం ఇచ్చారని అంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రోజా జగన్ కాళ్లకు మొక్కిన తరువాత, మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు సైతం మొక్కడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. రోజాకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ కావడం వెనుక ఇంత తతంగం నడిచిందనీ, అందుకే అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారని అంటున్నారు.