పెట్టుబడుల వేటలో జగన్ దావోస్ పర్యటన.. సంక్షేమం చాటేందుకు మంత్రుల బస్సు యాత్ర

ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం విదేశీ పర్యటనకు బయలు దేరి వెళుతుతున్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో హాజరయ్యేందుకే విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మొత్తం పది రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమై తిరిగి వచ్చే సరికే పూర్తైపోతుంది. గడప గడపకూ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జగన్ ఆదేశాల మేరకు చేపట్టనున్న మంత్రుల బస్సు యాత్ర వైఫల్యాల భారం తాను మోయాల్సిన అవసరం లేకుండా తన విదేశీ పర్యటన సమయంలోనే మంత్రుల బస్సు యాత్రను జగన్ షెడ్యూల్ చేసి ఉంటారని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.

ఇలా ఉండగా జగన్ దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తాయన్న ఆశలు పెట్టుకోవద్దని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెప్పేశారు. పెట్టుబడులపై ఆశలు వద్దంటూనే దావోస్ సదస్సుకు వెళ్లడమెందుకని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

కాగా ఈ పర్యటనలో జగన్ వెంట  మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు. జగన్ దావోస్ పర్యటనలో ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షించగలుగుతారు... మంత్రుల బస్సు యాత్రలో ఏ మేరకు ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించి సమాధాన పరచగలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది.